Fake News, Telugu
 

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణ హోంమంత్రి, నల్గొండ జిల్లా కలెక్టర్ కూడా జాతీయ జెండాకు సెల్యూట్ చేసారు

0

జెండా ఆవిష్కరణ సమయంలో జాతీయ జెండాకు సెల్యూట్ చేయని ప్రముఖులు అంటూ ఒక ఫోటోతో కూడిన పోస్ట్ బాగా షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉన్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: జెండా ఆవిష్కరణ సమయంలో జాతీయ జెండాకు సెల్యూట్ చేయని తెలంగాణ హోంమంత్రి, నల్గొండ జిల్లా కలెక్టర్.

ఫాక్ట్: జాతీయ జెండాకు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెండాను ఎగురవేసిన వెంటనే సెల్యూట్ చేసారు. వారు జాతీయ జెండాను 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అగౌరవ పరిచినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ వెతకగా కొన్ని ఫోటోలు తన ఫేస్బుక్ అకౌంట్‌లో లభించాయి. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నల్గొండలో జాతీయ జెండాను ఎగురవేశారని చెప్తూ కొన్ని ఫోటోలతో ఫేస్బుక్ పోస్ట్ చేసారు. ఒక ఫోటోలో (పోస్టులోని ఫోటోలాగా) శ్రద్ధగా నిల్చున్నప్పటికీ, వేరే ఫోటోల్లో వివిధ సందర్భాల్లో సెల్యూట్ చేస్తూ కనబడటం చూడొచ్చు.

అదే రోజు ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్ లోని నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసినట్టు హోంమంత్రి మహమూద్ అలీ ట్విట్టర్ అకౌంట్‌లో చూడొచ్చు. జెండా ఆవిష్కరణ సమయంలో జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్నట్టు ట్వీట్ చేసిన వీడియలో చూడొచ్చు.

నల్గొండలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి వీడియోలు వెతకగా, హోంమంత్రి మహమూద్ అలీ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్న కార్యక్రమం యొక్క వీడియోలు లభించాయి. ఈ యూట్యూబ్‌ వీడియోలో జెండాను ఎగురవేసిన వెంటనే హోంమంత్రి, కలెక్టర్ కూడా సెల్యూట్ చేస్తున్నట్టు చూడొచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరో వీడియోలో కూడా వారు సెల్యూట్ చేస్తున్నట్టు చూడొచ్చు.

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నల్గొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వెలుగు దినపత్రిక 16 ఆగష్టు 2021న ప్రచురించిన ఒక ఆర్టికల్‌లోనల్గొండలో జాతీయ జెండాను ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్న హోంమంత్రి మహమూద్ అలీ” అని ఫోటో కాప్షన్‌గా చూడొచ్చు.

చివరగా, 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణ హోంమంత్రి, నల్గొండ జిల్లా కలెక్టర్ కూడా జాతీయ జెండాకు సెల్యూట్ చేసారు.

Share.

About Author

Comments are closed.

scroll