Fake News, Telugu
 

అదుపుతప్పిన ట్రాక్టర్ వెనక ప్రజలు పరిగెడుతున్న వీడియోని రైతులను తరుముతున్న గ్రామ ప్రజలంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు

0

పొలాల్లోకి దూసుకెళ్తున్న ఒక ట్రాక్టర్ వెనకాల జనం పరిగెడుతున్న ఒక వీడియోని చూపిస్తూ ‘ఢిల్లీ లో విధ్వంసం సృష్టించిన ఫేక్ రైతుల ట్రాక్టర్లను తరుముతున్న పంజాబ్ సరిహద్దు గ్రామ ప్రజలు’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఢిల్లీలో విధ్వంసం సృష్టించిన ఫేక్ రైతుల ట్రాక్టర్లను తరుముతున్న పంజాబ్ సరిహద్దు గ్రామ ప్రజలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో ఉత్తరప్రదేశ్ లోని మథురలో ట్రాక్టర్ స్టంట్స్ చేస్తుండగా ఒక డ్రైవర్ నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి డ్రైవర్ పడిపోయాక , డ్రైవర్ లేకుండానే పొలాల్లోకి దూసుకెళ్ళిన ఘటనది. ఢిల్లీలో నిరసన తెలిపిన రైతుల ట్రాక్టర్లను తరుముతున్న పంజాబ్ సరిహద్దు గ్రామ ప్రజలు అన్న వాదనలో నిజం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం యూట్యూబ్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా పోస్టులో ట్రాక్టర్ దూసుకుపోతున్న వీడియోని వేరే కోణంలో చూపించిన ETV Bharat న్యూస్ వీడియో మాకు కనిపించింది. ఈ వీడియో కథనం ప్రకారం మథురలోని మొర్కి ఇంటర్ కాలేజీ గ్రౌండ్ లో భారతీయ కిసాన్ యూనియన్ సభ్యులు నిర్వహించిన ట్రాక్టర్ స్టంట్స్ లో ఒక డ్రైవర్ నడుపుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి డ్రైవర్ పడిపోయాక , డ్రైవర్ లేకుండానే పొలాల్లోకి దూసుకెళ్ళింది. పోస్టులో ఉన్న వీడియో ఈ ఘటనకి సంబంధించిందే. ETV Bharat వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.

యూట్యూబ్ న్యూస్ వీడియో ఆధారంగా ఫేస్‌బుక్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఒక వార్తా సంస్థ తమ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసిన పోస్ట్ మాకు కనిపించింది. ఈ వీడియోలో ఉన్న విజువల్స్ పోస్టులో ఉన్న వీడియోలోని విజువల్స్ ఒకేలా ఉండడం గమనించొచ్చు. ఐతే ఈ వీడియో కథనం కూడా ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మథురలో ట్రాక్టర్ స్టంట్స్ నిర్వహించిన సమయంలో జరిగిందని ధృవీకరిస్తుంది. ఈ ఘటనని రిపోర్ట్ చేసిన న్యూస్18 వైరల్ వీడియో ఇక్కడ చూడొచ్చు.

రిపబ్లిక్ డే రోజున కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ పెరేడ్ లో హింస చోటుచేసుకున్న నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, మథురలో అదుపుతప్పిన ట్రాక్టర్ వెనక ప్రజలు పరిగెడుతున్న వీడియోని రైతులు ట్రాక్టర్లను తరుముతున్న పంజాబ్ సరిహద్దు గ్రామ ప్రజలంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll