Fake News, Telugu
 

ఇనుప టైర్ల ఈ ట్రాక్టర్ కి రిపబ్లిక్ డే రోజున నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీకి ఎటువంటి సంబంధం లేదు

0

రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో అలజడులు సృష్టించాలనే ఉద్దేశంతో రైతులు ప్రత్యేకంగా తయారు చేపించిన ట్రాక్టర్ ఫోటో అని చెప్తూ, ఇనుప టైర్లు ఉన్న ఒక ట్రాక్టర్ ఫోటో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ పోస్టులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రిపబ్లిక్ డే ట్రాక్టర్ ర్యాలీ కోసం రైతులు ప్రత్యేకంగా తయారు చేపించిన ఇనుప టైర్ల ట్రాక్టర్ ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో ఇంటర్నెట్ లో 2013 నుండే అందుబాటులో ఉంది. ఈ ఫోటోకి ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీకి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2013లో అప్లోడ్ చేసిన ఒక యూట్యూబ్ వీడియోలో ఇదే ఫోటో యొక్క విజువల్ మాకు కనిపించింది. దిన్నిబట్టి ఈ ఫోటో చాలా పాతదని, ఈ ఫోటోలో ఉన్న ట్రాక్టర్ ని రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీ కోసం తయారు చేయలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఈ వీడియో చెప్తున్న దాని ప్రకారం ఈ వీడియో అమెరికా లోని న్యూయార్క్ రాష్ట్రంలోని గ్రామాలలో నివసించే మెన్నోనైట్ అనబడే అనాబాప్టిజంని ఆచరించే ప్రత్యేక క్రిస్టియన్లకు సంబంధించింది. వీరు తమ ట్రాక్టర్లలో మెటల్ చక్రాలను ఉపయోగిస్తున్నారు. ఇలా మెటల్ చక్రాలను వాడడం వల్ల ప్రయాణం చేయడం సులువుగా ఉండదు కాబట్టి వీరు ప్రయాణాలు తక్కువ చేసే ఆస్కారం ఉంటుంది, అందువల్ల వీరందరు ఒకే దగ్గర కలిసి ఉంటారని వీరి నమ్మకం. యూట్యూబ్ వీడియో ద్వార పొందిన సమాచారం ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ చేయగా ఇదే విషయం గురించి 2018లో రాసిన ఒక బ్లాగ్ కనిపించిది, ఈ బ్లాగ్ కూడా పైన తెలిపిన విషయాన్నీ దృవీకరిస్తుంది. వీటన్నిటి బట్టి పోస్టులోని ట్రాక్టర్ ఫోటో ఢిల్లీలో రైతులు నిర్వహించిన ర్యాలీకి సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే రోజున ఢిల్లీ రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

చివరగా, ఇనుప టైర్ల ఈ ట్రాక్టర్ కి రిపబ్లిక్ డే రోజున నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీకి ఎటువంటి సంబంధంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll