Fake News, Telugu
 

‘బాయ్ ఫ్రెండ్ ఉంటేనే కాలేజీలోకి అమ్మాయిలకు అనుమతి’ అని ఈ రెండు కాలేజీలు నోటిసులు ఇవ్వలేదు

0

‘ఫిబ్రవరి 14 వ తేదీ కల్లా కనీసం ఒక్క బాయ్ ఫ్రెండ్ అయినా ఉంటేనే కాలేజీ లోకి అనుమతి’ అని చెప్తూ, సెయింట్ జాన్స్ కాలేజీ (ఆగ్రా) తమ కాలేజీ అమ్మాయిలకు నోటీసు ఇచ్చినట్టు ఒక ఫోటోని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. అమ్మాయిల భద్రత కోసం కాలేజీ ఈ నిర్ణయం తీసుకునట్టు నోటీసులో రాసి ఉంది. అలాంటి నోటీసుని SRM యూనివర్సిటీ వారు కూడా ఇచ్చినట్టు మరో ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుంది. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

పై పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బాయ్ ఫ్రెండ్ ఉంటేనే కాలేజీ లోకి అమ్మాయిలకు అనుమతి అని సెయింట్ జాన్స్ కాలేజీ (ఆగ్రా) మరియు SRM యూనివర్సిటీ ఇచ్చిన నోటిసుల ఫోటోలు.

ఫాక్ట్: బాయ్ ఫ్రెండ్ ఉంటేనే కాలేజీ లోకి అమ్మాయిలకు అనుమతి అని చెప్తూ సెయింట్ జాన్స్ కాలేజీ (ఆగ్రా) మరియు SRM యూనివర్సిటీ వారు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. సోషల్ మీడియాలో షేర్ చేయబడుతున్నవి ఫేక్ నోటిసులు అని రెండు కాలేజీల యాజమాన్యాలు వివరణ ఇచ్చాయి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

సెయింట్ జాన్స్ కాలేజీ (ఆగ్రా):

ఫోటోలోని నోటిసుని సెయింట్ జాన్స్ కాలేజీ (ఆగ్రా) ఇచ్చిందా అని ఇంటర్నెట్ లో వెతకగా, ఈ విషయం పై ‘ది టైమ్స్ అఫ్ ఇండియా’ వారు ప్రచురించిన ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఫేక్ నోటిసు అని సెయింట్ జాన్స్ కాలేజీ (ఆగ్రా) ప్రిన్సిపాల్ తెలిపినట్టు తెలుస్తుంది. నోటిసులో ఉన్న పేరుతో అసలు తమ కాలేజీలో ప్రొఫెసర్ లేడని కాలేజీ వర్గాలు తెలిపినట్టు ‘ది టైమ్స్ అఫ్ ఇండియా’ ఆర్టికల్ లో చదవొచ్చు.

ఈ విషయం పై వివరణ ఇస్తూ సెయింట్ జాన్స్ కాలేజీ (ఆగ్రా) తమ ఫేస్బుక్ పేజీలో పెట్టిన పోస్ట్ ని ఇక్కడ చూడవొచ్చు.

SRM యూనివర్సిటీ:

ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వారు కూడా తమ కాలేజీ పేరుతో వైరల్ అవుతున్న నోటిసు పై వివరణ ఇచ్చారు. సోషల్ మీడియా లో షేర్ చేయబడుతుంది ఫేక్ సర్కులర్ అని, ఈ విషయం పై సైబర్ క్రైమ్ పోలీస్ లకు ఫిర్యాదు చేసినట్టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వారి వెబ్సైటులో చదవొచ్చు.

చివరగా, ‘బాయ్ ఫ్రెండ్ ఉంటేనే కాలేజీ లోకి అమ్మాయిలకు అనుమతి’ అని సెయింట్ జాన్స్ కాలేజీ (ఆగ్రా) మరియు SRM యూనివర్సిటీ నోటిసులు ఇవ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll