Fake News, Telugu
 

వై.యెస్.జగన్ ఫోటో తగిలించిన బైక్‌ని నారా లోకేష్ నడిపినట్టు షేర్ చేస్తున్నది ఫేక్ ఫోటో 

0

తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యెస్.జగన్ ఫోటో హెడ్ లైట్ డూమ్ పై తగిలించిన బైక్ నడుపుతున్న దృశ్యాలంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ ఫోటో ఎడిట్ చేయబడిందని ఒక యూసర్ ఈ పోస్టుకి రిప్లై ఇచ్చారు. మరి ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వై.యెస్.జగన్ ఫోటో తగిలించిన బైక్‌ని నారా లోకేష్ నడుపుతున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో ఎడిట్ చేయబడినది. 2018లో తిత్లి తుఫాను బాధితులని పరామర్శించడానికి అప్పటి పంచాయతి శాఖా మంత్రిగా పనిచేస్తున్న నారా లోకేష్ ఇలా బైక్ పై పర్యటించారు. నారా లోకేష్ నడుపుతున్న ఆ బైక్ పై వై.యెస్.జగన్ ఫోటో ఎక్కడా లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Asianet News Telugu’ న్యూస్ వెబ్ సైట్ 13 అక్టోబర్ 2018 నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. శ్రీకాకుళంలో తిత్లి తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలని కలుసుకునేందుకు పంచాయతి రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్  బైక్ పై పర్యటించినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. ఈ ఆర్టికల్ షేర్ చేసిన ఫోటోలో, నారా లోకేష్ నడుపుతున్న బండి పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యెస్.జగన్ ఫోటో ఎక్కడా లేదు. ఆ బైక్ పై ‘ఓం’ చిహ్నం మాత్రమే ఉండటాన్ని మనం గమనించవచ్చు.

2018లో నారా లోకేష్ చేసిన ఈ బైక్ పర్యటనకి సంబంధించి వివిధ తెలుగు న్యూస్ చానల్స్ రిపోర్ట్ చేసాయి. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. నారా లోకేష్ నడుపుతున్న బైక్ పై వై.యెస్.జగన్ ఫోటో లేదు అని ఈ వీడియోలలో స్పష్టంగా తెలుస్తుంది. నారా లోకేష్ బైక్ నడుపుతున్న ఒరిజినల్ ఫోటోని ‘The New Indian Express’ న్యూస్ వెబ్ సైట్ కూడా తమ ఆర్టికల్ లో పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఎడిట్ చేసిన ఫోటోని చూపిస్తూ తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ వై.యెస్.జగన్ ఫోటో తగిలించిన బైక్ నడిపినట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll