Fake News, Telugu
 

సిములేషన్ వీడియోని చూపిస్తూ చైనా దేశం గాల్లో ప్రయాణించే రైలుని రూపొందించిందని షేర్ చేస్తున్నారు

0

చైనా దేశానికి చెందిన రైలు గాలిలో ప్రయాణిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. చైనా దేశంలోని చేడుంగ్ నగరంలో, గంటకి 450 నుండి 490 కిలోమీటర్ల వేగంతో గాల్లో ప్రయాణించే అత్యాధునిక రైలుని, చైనా ప్రభుత్వం ఇటివల ప్రారంభించిందని మరొక యూసర్ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చైనా దేశం తయారు చేసిన అత్యాధునిక రైలు గాలి లో ప్రయాణిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో సిములేషన్ ద్వారా రూపొందించింది. సిములేషన్ వీడియోలను తయారు చేసి పోస్ట్ చేసే ఒక యూట్యూబ్ ఛానల్, ఈ వీడియోని రూపొందించింది. 16 జనవరి 2021 నాడు చైనా తమ సొంత సాంకేతిక పరిజ్ఞానం తో రూపొందించిన మాగ్లెవ్ ప్రోటో టైప్ రైలుని ఆరంభించింది. గంటకి 620 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్, మున్ముందు గంటకి 800 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగేలా చైనా సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్స్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియోని కొన్ని కీ వర్డ్స్ వాడి గూగుల్ లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని  ఒక యూసర్ తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో పై ‘DENDI KOMARA RAILFANS ID’ అనే వాటర్ మార్క్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. ‘DENDI KOMARA RAILFANS ID’ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ లింకుని ఈ వీడియో వివరణలో పెట్టారు.

ఈ లింకు ఆధారంగా ‘DENDI KOMARA RAILFANS ID’ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే, పోస్టు షేర్ చేసిన వీడియోని ఈ ఛానల్ 11 ఆగష్టు 2020 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో టైటిల్ ని ఇంగ్లీష్ బాషలో అనువదించి చూస్తే, ‘Train Down from the Sky (Game Only)’ అనే టైటిల్ తో ఈ వీడియోని ఆ ఛానల్ పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో కనిపిస్తున్నది  “Trainz Railroad Simulator 2019” అనే వీడియో గేమ్ కి సంబంధించిన దృశ్యాలని వివరణలో తెలిపారు. “Trainz Railroad Simulator 2019” వీడియో గేమ్ ఫేస్బుక్ పేజిని ఇక్కడ చూడవచ్చు. సిములేషన్ చేయబడిన మరెన్నో వీడియోలని, ఈ ఫేస్బుక్ పేజి లో మనం చూడవచ్చు.

చైనా తమ సొంత సాంకేతిక పరిజ్ఞానం తో రూపొందించిన మాగ్లెవ్ ప్రోటో టైప్ రైలుని 16 జనవరి 2021 నాడు చెంగ్డు నగరంలో ప్రారంభించినట్టు ‘China Xinhua News’ ఛానల్ తమ ట్వీట్ లో రిపోర్ట్ చేసింది. గంటకి 620 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్, మున్ముందు గంటకి 800 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగేలా చైనా సన్నాహాలు చేస్తున్నట్టు South China Morning Post ఛానల్ రిపోర్ట్ చేసింది.

చివరగా, సిములేషన్ ద్వార రూపొందించిన వీడియోని చూపిస్తూ చైనా దేశం గాల్లో ప్రయాణించే రైలుని రూపొందించిందని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll