ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ స్టేజీపై మాట్లాడడం మధ్యలో ఆపేసి లేచి వెళ్ళిపోయినట్టు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. స్టేజీపై మైక్ పనిచేయకపోవడంతో కోపంగా లేచి వెళ్ళిపోయిన డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: స్టేజీపై మైక్ పనిచేయకపోవడంతో డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కోపంగా లేచి వెళ్ళిపోయిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): 12 జులై 2024న అమరావతిలో జరిగిన పంచాయతీరాజ్ శాఖ మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో స్టేజీపై కూర్చొని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో ఏ కారణం చేతనో మైక్ కింద పెట్టేసి పోడియం వద్దకు వెళ్లి మాట్లాడతాడు. ఐతే కేవలం మైక్ కింద పెట్టి వెళ్ళిపోయిన టైం వరకే వీడియోను కట్ చేసి షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ 12 జులై 2024న అమరావతిలో ఆ శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం డిప్యూటీ సీఎం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో ఈ మీడియా సమావేశానికి సంబంధించిందే. ఐతే సోషల్ మీడియాలో వాదిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఈ సమావేశం నుండి అర్ధాంతరంగా వెళ్లిపోలేదు.
ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ సమావేశానికి సంబంధించిన న్యూస్ రిపోర్ట్ మాకు కనిపించింది. ఐతే వీడియో రిపోర్ట్ ప్రకారం మొదట పవన్ కళ్యాణ్ స్టేజీపై కూర్చొని మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు, ఆ తరవాత ఏ కారణం చేతనో మైక్ కింద పెట్టేసి పోడియం వద్దకు వెళ్లి మాట్లాడతాడు. అక్కడి నుండి తన ప్రసంగాన్ని పూర్తి చేస్తాడు.

పవన్ కళ్యాణ్ ఈ మీడియా సమావేశంలో మాట్లాడిన పూర్తి వీడియో రిపోర్ట్ ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి చేతిలోని మైక్ కింద పెట్టేసి వేగంగా వెళ్లిపోయిన సందర్భం వరకే వీడియోను కట్ చేసి పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నుండి అర్ధాంతరంగా వెళ్ళిపోయినట్టు షేర్ చేస్తున్నట్టు అర్ధం చేసుకోవచ్చు.
చివరగా, స్టేజీపై మైక్ పనిచేయకపోవడంతో పవన్ కళ్యాణ్ కోపంగా లేచి వెళ్ళిపోయాడంటూ ఒక అసంపూర్ణమైన వీడియోను షేర్ చేస్తున్నారు.