దక్షిణ అమెరికాలోని మెక్సికోలో తవ్వకాల్లో బయటపడ్డ ఐదు వేల సంవత్సరాల నాటి శివలింగం చిత్రం అని సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ చేస్తున్నారు. అసలు ఈ ఫోటో వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: మెక్సికోలో తవ్వకాల్లో బయటపడ్డ శివలింగం ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఈ ఫొటోలో ఉన్న శివలింగం కంబోడియా దేశంలో ఉన్న సంబోర్ ప్రెయ్ కుక్ అనే పురాతన దేవాలయ సముదాయంలోది. ఈ సముదాయం యునెస్కో చేత వరల్డ్ హెరిటేజ్ సైటుగా గుర్తించబడింది. అంతే కాకుండా, మెక్సికోలో తవ్వకాల్లో ఐదు వేల ఏళ్ళ నాటి పురాతన శివలింగం బయటపడింది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అంచేత పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో ఉన్న ఫోటోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, అందులో ఉన్న శివలింగం యొక్క ఫోటో Flickr అనే ఇమేజ్ హోస్టింగ్ వెబ్సైటులో లభించింది.
కాలిన్ కీ అనే జర్మన్ ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోని అప్లోడ్ చేసారు, ఫోటో కింద ఈ ఫోటోను తీసిన లొకేషన్ లింకు ఇచ్చారు. దాని బట్టి ఈ ఫోటో కంబోడియాలో ‘సంబోర్ ప్రెయ్ కుక్’ అనే పురాతన దేవాలయ సముదాయంలోనిది అని తెలిసింది.
‘సంబోర్ ప్రెయ్ కుక్’ గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఇది క్రీస్తు శకం 6 మరియు 7వ శతాబ్దాల్లో వర్ధిల్లిన ‘చెన్ల సామాజ్యం’ వారి సమయం నాటి కట్టడం అని తెలిసింది.
ఈ పురావస్తు స్థలం ‘చెన్ల సామ్రాజ్యం ‘ రాజధాని ఇషణపురగా గుర్తించటం జరిగింది. అంతే కాక యునెస్కో ఈ స్థలాన్ని వరల్డ్ హెరిటేజ్ సైటుగా కూడా గుర్తించింది. వైరల్ ఫొటోలో ఉన్న శివలింగం ఈ దేవాలయ సముదాయంలోనే ఉంది. గూగుల్ మాప్సులో కూడా ఒక యూసర్ అప్లోడ్ చేసిన ఈ ఫొటోలో ఈ లింగాన్ని చూడచ్చు. అంతే కాకుండా గూగుల్ స్ట్రీట్ వ్యూలో కూడా ఈ లింగాన్ని స్పష్టంగా చూడవచ్చు.
ఇంటర్నెట్లో ‘సంబోర్ ప్రెయ్ కుక్’ గురించి ఉన్న అనేక ఆర్టికల్స్లో కుడా ఈ శివలింగం యొక్క ఫోటో ఉంది, వాటిని ఇక్కడ, ఇక్కడ మరియి ఇక్కడ చూడవచ్చు. అసలు మెక్సికో దేశంలో పురావస్తు తవ్వకాల్లో ఏదైనా ఐదు వేల ఏళ్ళ నాటి పురాతన శివలింగం వెలికితీయబడిందా అని ఇంటర్నెట్లో వెతికితే, దానికి సంబంధించి ఎటువంటి సమాచారం లభించలేదు.
చివరిగా, కంబోడియాలోని సంబోర్ ప్రెయ్ కుక్ అనే పురాతన దేవాలయ సముదాయంలో ఉన్న శివలింగం చిత్రాన్ని మెక్సికోలో తవ్వాకాల్లో బయటపడినట్టు షేర్ చేస్తున్నారు.