ఇటీవల ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి (BRS) మొదటి బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో, ఈ సభలో BRS మహిళా కార్యకర్తలు మద్యం సేవిస్తున్నారని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: 18 జనవరి 2023న ఖమ్మంలో జరిగిన BRS సభలో మద్యం సేవిస్తున్న BRS మహిళా కార్యకర్తల వీడియో.
ఫాక్ట్: ఈ వీడియో ఇటీవల ఖమ్మంలో జరిగిన BRS సభకు చెందినది కాదు. మార్చి 2021 నుంచే దీనికి సంబంధించిన పూర్తి వీడియోని వివిధ యూట్యూబ్ ఛానెళ్ళు అప్లోడ్ చేసాయి. కొందరు మహిళలు వారి కుటుంబ సభ్యులతో కలిసి కారులో కూర్చొని మద్యం సేవిస్తుండడం చూడవచ్చు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా సంబంధిత కీ వర్డ్స్ తో వైరల్ వీడియో గురించి ఇంటర్నెట్లో వెతకగా, దీనికి సంబంధించిన పూర్తి వీడియో యూట్యూబ్‌లో లభించింది. ఈ వీడియో 11 మార్చి 2021న అప్లోడ్ చేయబడింది. వీడియోలో ఉన్న దాని ప్రకారం కొందరు మహిళలు వారి కుటుంబ సభ్యులతో కలిసి కారులో కూర్చొని మద్యం సేవిస్తున్నట్లుగా చూడవచ్చు. ఘటన జరిగిన ప్రదేశం మరియు సమయం ఖచ్చితంగా తెలియనప్పటికీ, ఈ వీడియో 18 జనవరి 2023 లో ఖమ్మంలో జరిగిన బహిరంగ సభకు చెందినది కాదని స్పష్టం అవుతుంది. ఇదే వీడియోని మరికొందరు కూడా 2021లో యూట్యూబ్‌లో అప్‌లోడు చేశారు. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, సంబంధంలేని పాత వీడియోని షేర్ చేస్తూ ఇటీవల ఖమ్మం సభలో BRS మహిళా కార్యకర్తలు మద్యం సేవిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు.