వివరణ (OCTOBER 7, 2021):
ఇదే వీడియోని ఇప్పుడు హిమంత బిస్వ శర్మ ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన సంఘటనగా కూడా షేర్ చేస్తున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అస్సాంలో తమకు భారత్ నుండి స్వాతంత్రం కావాలని కోరుతూ నిరసన చేస్తున్న కొందరు నిరసనకారులను పోలీసులు కొడుతున్న వీడియో అంటూ ఒక వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఐతే ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అస్సాంలో భారత్ నుండి స్వాతంత్రం కావాలని కోరుతూ నిరసన చేస్తున్న కొందరు నిరసనకారులను పోలీసులు కొడుతున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో 2017లో అస్సాంలోని గోల్పారాలో తమని అక్రమ వలసదారులు లేదా ‘డి’ వోటర్ (డౌట్ ఫుల్ వోటర్) గా అస్సాం ప్రభుత్వం పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ముస్లింలు నిరసన తెలపిన ఘటనకి సంబంధించింది. ఈ వీడియోలో నిరసనకారులు తమకి భారత్ నుండి స్వాతంత్రం కావాలని నిరసన తెలుపట్లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు
ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియోకి సంబంధించి 2017లో వార్తలు ప్రచురించిన కొన్ని అస్సాంకి చెందిన ప్రాంతీయ వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం తమని అక్రమ వలసదారులు లేదా ‘డి’ వోటర్ (డౌట్ ఫుల్ వోటర్) గా అస్సాం ప్రభుత్వం పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ అస్సాంలోని గోల్పారాలో కొందరు ముస్లింలు నిరసన తెలపారు. ఐతే ఈ నిరసనలను అదుపులోకి తేవడానికి పోలీసులు కాల్పులు జరపగా ఈ కాల్పులలో యాకుబ్ అలీ అనే వ్యక్తి చనిపోయాడు. పోస్టులోని వీడియో ఈ నిరసనలకు సంబంధించిందే. ఈ వార్తా కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈ ఘటనపై రాసిన కథనంలో ఎక్కడ కూడా నిరసనకారులు తమకి భారత్ నుండి స్వాతంత్రం కావాలని నిరసన తెలుపుతున్నట్టు రాయలేదు. పైగా మరికొన్ని వార్తా సంస్థలు ఈ నిరసనలు ప్రభుత్వం వీరిని అక్రమ వలసదారులు లేదా ‘డి’ వోటర్ (డౌట్ ఫుల్ ఓటర్) గా పరిగణించడానికి వ్యతిరేకంగా జరిగినట్టు పేర్కొన్నాయి. ఈ కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఈ వీడియోకి సంబంధించి ఇండియాటుడే రాసిన కథనంలో నిరసనకారులు పట్టుకున్న బ్యానర్ పై తమని ‘డి’ వోటర్ కింద పరిగణించడానికి వ్యతిరేకంగానే నిరసనలు తెలుపుతున్నట్టు రాసుందని పేర్కొంది.
‘డి’ వోటర్ :
అస్సాంలో నేషనల్ రిజిస్టర్ అఫ్ సిటిజన్స్ (NRC) రూపొందించే నేపథ్యంలో ఎవరికైతే తమ పౌరసత్వం నిరూపించుకోవడానికి సరైన ఆధారాలు లేవో వారిని ప్రభుత్వం ‘డి’ వోటర్ (డౌట్ ఫుల్ వోటర్) అనే ఒక క్యాటేగిరి కింద పరిగణిస్తుంది. ‘డి’ వోటర్ కింద పరిగణించిన వారు ఎన్నికల్లో వోట్ వేయడానికి మరియు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు. ఫారినర్స్ ట్రిబ్యునల్ నుండి అన్ని అనుమతులు తెచ్చుకున్నాకే వీరిని NRCలో చేరుస్తారు. FACTLY ‘డి’ వోటర్ కి సంబంధించి వివరంగా రాసిన కథనం ఇక్కడ చూడొచ్చు.
చివరగా, ఈ వీడియోలో నిరసనకారులు తమకు భారత్ నుండి స్వాతంత్రం కావాలని నిరసన తెలపట్లేదు.