Fake News, Telugu
 

కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి బిరుదు ఇవ్వలేదు

0

యాసిన్ మాలిక్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ఉన్న ఫోటో మరియు యాసిన్ మాలిక్‌ను పోలీసులు తీసుకెళ్తున్న రెండు ఫోటోలను షేర్ చేస్తూ ‘యాసిన్ మాలిక్‌ను 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ ఐకాన్ బిరుదుతో సత్కరించిందని, అదే నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక పోలీసులు అతన్ని ఈడ్చుకెళ్ళి జైల్లో పడేసారని’  క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా పోస్టులో క్లెయిమ్ చేస్తున్న దానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: యాసిన్ మాలిక్‌ను 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ ఐకాన్ బిరుదుతో సత్కరించిందని, అదే నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక పోలీసులు అతన్ని ఈడ్చుకెళ్ళి జైల్లో పడేసారు.’

ఫాక్ట్ (నిజం): 2006లో కాశ్మీర్ అంశంపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) నాయకుడు యాసిన్ మాలిక్‌తో చర్చించాడు. పోస్టులో షేర్ చేసిన ఫోటో ఆ సందర్భంలో తీసిందే. ఐతే కాంగ్రెస్ ప్రభుత్వం యాసిన్ మాలిక్‌కు ఎటువంటి బిరుదును ఇవ్వలేదు. 2008లో ఇండియాటుడే సంస్థ నిర్వహించిన కాన్‌క్లేవ్‌’లో భాగంగా నిర్వహించిన యూత్ ఫోరం సెషన్‌లో మాట్లాడిన స్పీకర్లలో యాసిన్ మాలిక్ ఒకడు. 2019లో మోదీ ప్రభుత్వం పబ్లిక్ సేఫ్టీ ఆక్ట్ (PSA) కింద యాసిన్ మాలిక్‌ను అరెస్ట్ చేసింది. మాలిక్ టెర్రర్ ఫండింగ్, మంత్రి కూతురి కిడ్నాప్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఆఫీసర్లను చంపిన పాత కేసులో విచారణ ఎదురుకొంటున్నాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

2006లో కాశ్మీర్ అంశంపై చర్చించడానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) నాయకుడు యాసిన్ మాలిక్‌ను ఆహ్వానించాడు. ఇందులో భాగంగానే యాసిన్ మాలిక్ 2006 ఫిబ్రవరిలో మన్మోహన్ సింగ్‌ను తన అధికారిక నివాసంలో కలిసాడు, పోస్టులో యాసిన్ మాలిక్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ఉన్న ఫోటో ఈ సందర్భంలో తీసిందే. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఇండియాటుడే కాన్క్లేవ్‌ :

ఐతే పోస్టులో చెప్తునట్టు కాంగ్రెస్ ప్రభుత్వం యాసిన్ మాలిక్‌ను ఎటువంటి బిరుదుతో సత్కరించలేదు. 2008లో ఇండియాటుడే సంస్థ నిర్వహించిన కాన్‌క్లేవ్‌’లో భాగంగా నిర్వహించిన యూత్ ఫోరం సెషన్‌లో మాట్లాడిన స్పీకర్లలో యాసిన్ మాలిక్ ఒకడు. దీనికి సంబంధించిన సమాచారం ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ సమావేశంలో యాసిన్ మాలిక్‌ ప్రసంగాన్ని ఇక్కడ చూడొచ్చు. ఐతే దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం మాలిక్‌కు యూత్ ఐకాన్ అవార్డు ఇచ్చినట్టు తప్పుగా అర్ధం చేసుకొన్నారు.

2019 అరెస్ట్ :

ఐతే 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం యాసిన్ మాలిక్‌ను పబ్లిక్ సేఫ్టీ ఆక్ట్ (PSA) కింద అరెస్ట్ చేసి జైలులో నిర్బంధించింది. సుప్రీంకోర్టు ఆర్టికల్ 35A పై తీర్పు చెప్పే రెండు రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సేఫ్టీ ఆక్ట్ (PSA) కింద కాశ్మీర్ వేర్పాటువాద నాయకులను అరెస్ట్ చేసింది, ఇందులో భాగంగానే యాసిన్ మాలిక్‌ను అరెస్ట్ చేసింది, అలాగే జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) సంస్థను బ్యాన్ చేసింది. అరెస్ట్ సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

యాసిన్ మాలిక్‌ జైలులో ఉండగానే మార్చ్ 2019లో NIA మాలిక్‌ను పాత టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్ట్ చేసి విచారించింది. అప్పటి వరకు స్టేలో ఉన్న మంత్రి కూతురి కిడ్నాప్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఆఫీసర్లను చంపిన పాత కేసులలో తిరిగి విచారణ ప్రారంభించారు.

ఐతే పోలీసులు యాసిన్ మాలిక్‌ను ఈడ్చుకేల్తున్న ఫోటో మాత్రం 2017 జరిగిన అరెస్ట్‌కు సంబంధించింది (ఇక్కడ). 2017లో యాసిన్ మాలిక్ జమ్మూ కాశ్మీర్‌లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేసారు, ఆ తర్వాత విడుదల చేసారు.

చివరగా, కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి బిరుదు ఇవ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll