‘ఇకపై ఇంటింటికీ వెళ్లి కోవిడ్ టీకాల పంపిణీ మరియు 45 ఏళ్లకు తక్కువ వయస్సు ఉన్నవారికి కూడా టీకా ఇవ్వబోతున్నారని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఈ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ‘ఇకపై ఇంటింటికీ వెళ్లి కోవిడ్ టీకాల పంపిణీ మరియు 45 ఏళ్లకు తక్కువ వయస్సు ఉన్నవారికి కూడా టీకా’.
ఫాక్ట్ (నిజం): 45 ఏళ్లలోపు వారికి కోవిడ్-19 టీకాలు వేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోందని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డి. వి. సదానంద గౌడ తెలిపారని కొన్ని పత్రికలు ప్రచురించాయి, ఐతే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకైతే ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే ఇంటింటికి వెళ్లి కోవిడ్-19 టీకా అందించాలన్న విషయంపై కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు, ఈ విషయానికి సంబంధించి ఎటువంటి వార్తా కథనాలు కూడా అందుబాటులో లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వార్తకి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఇదే టైటిల్ తోపాటు ఇదే ఫోటో ఉన్న ఒక ఆన్లైన్ కథనం మాకు కనిపించింది. పోస్టులోని వార్త ఈ కథనం నుండే సేకరించినట్టు అర్థం చేసుకోవచ్చు. ఐతే ఈ కథనంలో ఎక్కడ కూడా ఇంటింటికీ వెళ్లి కోవిడ్ టీకాల పంపిణీ చేస్తారని గానీ లేక 45 ఏళ్లకు తక్కువ వయస్సు ఉన్నవారికి కూడా టీకా ఇవ్వబోతున్నారని గాని కచ్చితంగా చెప్పలేదు. కేవలం ‘కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో టీకాలను ఇవ్వడం ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతున్నారని, దీంతో కేంద్రం 45 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారికి కూడా టీకాలను అందించేందుకు సిద్దమవుతోందని’ మాత్రమే రాసుంది. అలాగే ‘దేశంలోని పౌరులకు ఇంటింటికీ వెళ్లి టీకాలను అందిస్తామని పలు కంపెనీలు కేంద్రాన్ని కోరాయని కానీ కేంద్రం దీనిపై ఇంకా తన వైఖరిని తెలియజేయలేదు, ఈ విషయంపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకోనుందని’ మాత్రమే రాసింది. పైగా ఈ వార్తకి సంబంధించి సోర్స్ కూడా ఇందులో ప్రస్తావించలేదు, కాబట్టి ఇది కేవలం కల్పిత వార్తగా పరిగణించాల్సి ఉంటుంది.
ఐతే హిందూ బిజినెస్ లైన్ కథనం ప్రకారం కోవిడ్ -19 యొక్క సెకండ్ వేవ్ లో 45 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారికి వేగంగా సోకుతుందని, కావున 45 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారికి కూడా టీకా ఇవ్వాలని నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. వారి వాదనకు మద్దతుగా ఒక ఉదాహరణ కూడా వారు పేర్కొన్నారు. ‘45 ఏళ్లలోపు వారికి టీకాలు వేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోందని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డి. వి. సదానంద గౌడ తెలిపారని’ ది వీక్ కథనం పేర్కొంది. ఐతే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అలాగే కోవిడ్ టీకా ఇంటింటికీ వెళ్లి కోవిడ్ టీకాల పంపిణీ విషయానికి సంబంధించి ఎటువంటి వార్తా కథనాలు గాని లేక అధికార సమాచారంగాని లేవు. ఒకవేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోని ఉంటే వార్తా సంస్థలు ఈ వార్తని ప్రచురించేవి కాని ఈ విషయానికి సంబంధించి ఎటువంటి కథనాలు లభించలేదు. కాబట్టి ఈ వార్త కల్పితమని భావించొచ్చు.
కోవిడ్-19 కి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించే ప్రెస్ బ్రీఫింగ్స్ లో కూడా పైన తెలిపిన విషయాల గురించి ప్రస్తావించలేదు. 13 ఏప్రిల్ 2021 రోజున జరిగిన ప్రెస్ బ్రీఫింగ్ లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DGCI) రష్యా యొక్క స్పుత్నిక్ V వాక్సిన్ కి అత్యవసర ఉపయోగం కోసం ఆమోదం ఇచ్చిందని తెలిపారు.
చివరగా, ఇంటింటికీ వెళ్లి కోవిడ్-19 టీకాలు పంపిణీ చేయనున్నారన్న వార్త ఇప్పటికైతే నిజం కాదు.