Fake News, Telugu
 

తిరుపతిలో చిరుతల సంచారం అంటూ పాత వీడియోలు షేర్ చేస్తున్నారు

0

తిరుపతిలోని SVU ఫ్లైఓవర్ బ్రిడ్జి క్రింద తుమ్మలగుంట దగ్గర చిరుత పులి సేద తీరుతున్న దృశ్యం అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో విస్తృతంగా షేర్ అవుతోంది. అలాగే ఇటీవల తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుతలు కనిపించాయి అంటూ ఒక వీడియో వాట్సాప్‌లో షేర్ అవుతుంది. ఈ వీడియో గురించి వివరణ కోరుతూ మా వాట్సాప్‌ టిప్‌లైన్‌కు ఒక అభ్యర్ధన వచ్చింది. ఈ కథనం ద్వారా ఆ రెండు వీడియోలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: తిరుపతిలోని SVU ఫ్లైఓవర్ బ్రిడ్జి క్రింద మరియు శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుతలు సంచరిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం):  తిరుపతిలో చిరుతల సంచారానికి సంబంధించి షేర్ అవుతున్న ఈ రెండు వీడియోలు పాతవి. ఇందులో ఒకటి ఏప్రిల్ నెలలో కర్ణాటక రాష్ట్రంలో రిపోర్ట్ అయ్యింది. మరొక వీడియో సెప్టెంబర్ 2020 నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. దీన్నిబట్టి ఈ వీడియోలు ఈ మధ్య కాలానికి సంబంధించినవి కావని స్పష్టమవుతుంది. కావున, పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ మధ్యకాలంలో తిరుపతిలో చిరుత పులుల సంచారం ఎక్కువైందని వార్తా కథనాలు చేసాయి. ఇటీవల తిరుమలకు వెళ్లే అలిపిరి మెట్ల మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మరణించిన ఘటన కూడా రిపోర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా తిరుపతిలో చిరుత సంచారం అంటూ వీడియోలు షేర్ అవుతున్నాయి. ఐతే పైన పేర్కొన్న పోస్టులో షేర్ చేసిన వీడియోలు తిరుపతికి సంబంధించినవి కావు, ఈ వీడియోలకు సంబంధించిన సమాచారం కింద చూద్దాం.

వీడియో 1:

రోడ్డు పక్కన చిరుత కూర్చొని ఉన్న ఈ దృశ్యాలు కర్ణాటక రాష్ట్రంలో రిపోర్ట్ అయ్యాయి. ఈ వీడియోతో తిరుపతికి ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా ఈ వీడియోను ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి.

ఈ కథనాల ప్రకారం వీడియోలోని ఘటన కర్నాటకలోని గడగ్ జిల్లాలోని బింకదకట్టి అనే గ్రామం దగ్గర 16 ఏప్రిల్ 2023న రిపోర్ట్ అయ్యింది. గడగ్ బింకదకట్టి రోడ్, NH 67పై చిరుత ఇలా కూర్చొని కనిపించింది. ఈ దృశ్యాలను మరొక వార్తా కథనం ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

వీడియో 2:

ఈ వీడియో ఈ మధ్య జరిగినట్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది, కాని ఈ వీడియో గత రెండు సంవత్సరాలుగా  ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా ఈ వీడియోను సెప్టెంబర్ 2020లో షేర్ చేసిన పలు యూట్యూబ్‌ పోస్టులు కనిపించాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

ఈ పోస్టులు కూడా ఈ వీడియోను తిరుపతికి ఆపాదిస్తునే షేర్ చేసాయి. ఐతే ఈ దృశ్యాలు నిజంగా తిరుపతికి సంబంధించినవో కావో తెలియనప్పటికీ, ఈ వీడియోలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న టైం బట్టి ఈ దృశ్యాలు ఇప్పటివి కావని స్పష్టమవుతుంది.

చివరగా, తిరుపతిలో చిరుతల సంచారం అంటూ పాత వీడియోలు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll