Fake News, Telugu
 

ఈ ఫోటోలో ఉన్న మహిళలు బంగ్లాదేశ్ హిందూ స్వతంత్ర సమరయోధులు కాదు

0

బంగ్లాదేశ్‌లో 50 ఏళ్ళ క్రితం హిందువులుగా ఉన్నవారు, ఇప్పుడు ముస్లింలుగా మారిపోయారని చెప్పే క్రమంలో ఒక ఫోటో కొలాజ్ షేర్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియా విస్తృతంగా షేర్ అవుతోంది. 1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాట సమయంలో తీసిన నలుగురు మహిళలకు సంబంధించింది అంటూ చెప్తున్న ఈ కొలాజ్లోని పాత ఫోటోలో మహిళలు బొట్టుతో హిందూ సంస్కృతిలో కనిపిస్తున్నారని, అదే ఇటీవల తీసిన ఫోటోలో ముస్లిం సంప్రదాయంలో కనిపిస్తున్నారని, తమ వాదనకి మద్దతుగా వాదిస్తునారు.

క్లెయిమ్: 1971 విముక్తి పోరాట సమయంలో తీసిన నలుగురు బంగ్లాదేశీ హిందూ మహిళ స్వతంత్ర సమరయోదుల ఫోటో.

ఫాక్ట్(నిజం): ఈ ఫోటో 1960ల ప్రారంభంలో తీయగా, ఫోటోలో ఉన్న నలుగురు మహిళలు మొదటి నుండి ముస్లిం మతాన్ని ఆచరిస్తున్నారు. ఇదే విషయం పలు మీడియా సంస్థలు ఆ మహిళల కుటుంబ సభ్యులను సంప్రదించి స్పష్టం చేసారు. అలాగే ఈ మహిళకు బంగ్లాదేశ్ స్వతంత్ర ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వైరల్ ఫోటో కొలాజ్ గురుంచి సమాచారం అందించిన వార్తా కథనం ఒకటి మాకు కనిపించింది. ఈ వార్తా సంస్థ ఫోటోలోని మహిళల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈ ఫొటోకు సంబంధించిన నిజాలను వెల్లడించింది.

ఐతే ఈ కథనం ప్రకారం ఫోటోలోని నలుగురు మహిళలు పేర్లు అయేషా అహ్మద్, రోకీయా అహ్మద్, రషీదా అహ్మద్ మరియు షహనారా అహ్మద్. ఈ నలుగురు ఢాకాలోని బనేడి కుటుంబానికి చెందినవారు కాగా, పోస్టులో బ్లాక్ & వైట్ ఫోటో ఖుల్నాలో 1960 ప్రారంభంలో తీసినట్టు పేర్కొన్నారు. ఈ మహిళల భర్త/సోదరులు వేటకు వెళ్లివచ్చిన తరవాత వీరు ఇలా తుపాకులతో ఫోటో దిగినట్టు పేర్కొన్నారు.

తిరిగి 2017లో ఒక పెళ్లి సందర్భంలో ఈ నలుగురు మహిళలు మళ్ళీ అదే స్టైల్‌లో ఫోటో దిగినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐతే ఈ ఫోటోకు బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి ఎటువంటి సంబంధం లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేసినట్టు ఈ వార్తా కథనంలో పేర్కొన్నారు. ఈ ఫోటోకు సంబంధించి ఇదే విషయాన్ని చెప్తున్న మరొక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.

ఈ ఫోటోకు సంబంధించి మరింత సమాచారం కోసం వెతకగా, ‘Bangladesh Old Photo Archive ‘ అనే ఒక ఫేస్‌బుక్‌ పేజీ వైరల్ పోస్టులో బ్లాక్ & వైట్ ఫోటోను 2013లోనే షేర్ చేసిన ఒక పోస్ట్ మాకు కనిపించింది. ఈ పోస్టులోని వివరణ ప్రకారం ఈ ఫోటో 1965లో తీసింది. ఫోటో కర్టసీ ‘రెనాన్ అహ్మద్’ అని పేర్కొన్నారు.

రెనాన్ అహ్మద్ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో కూడా ఇదే ఫోటోను 1961 అన్న కాప్షన్‌తో షేర్ చేసాడు. The Quint & The Logical Indian వార్తా సంస్థలు రెనాన్ అహ్మద్ మరియు ఇతర బంగ్లాదేశీ జర్నలిస్టులను సంప్రదించి, ఈ ఫోటోలోని మహిళలు మొదటి నుండి ముస్లిం మతానికి చెందినవారే అని, అలాగే వీరికి బంగ్లాదేశ్ స్వతంత్ర ఉద్యమానికి ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేసారు.

మేము కూడా రెనాన్ అహ్మద్‌ను ఈ వైరల్ ఫోటోకు సంబంధించి వివరణ కోరుతూ ఫేస్‌బుక్‌ ద్వారా సంప్రదించాము. సమాధానం వచ్చిన తర్వాత ఈ కథనం అప్డేట్ చేయబడుతుంది.

చివరగా, ఈ ఫోటోలో ఉన్న మహిళలు బంగ్లాదేశీ హిందూ స్వాతంత్ర సమరయోధులు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll