Fake News, Telugu
 

రంజాన్ సందర్భంగా మాంసం దుకాణాలను మూసివేయాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సూచించలేదు

0

రంజాన్ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ సూచనలతో ముస్లిం సోదరుల మాంసం దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ చేసుకున్నారని చెప్తూ ఒకే వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: రంజాన్ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ సూచనలతో మాంసం దుకాణాలను ముస్లిం వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు చెప్తున్న దృశ్యాలు.

ఫాక్ట్: ఈ వీడియో ఏప్రిల్ 2022 నాటిది. చైత్ర నవ సందర్భంగా ఘజియాబాద్ నగర పాలక సంస్థ జిల్లాలో మాంసం విక్రయాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో రంజాన్ మాసం ఉండటంతో ముస్లింలు ఈ నిర్ణయానికి ఎలా స్పందిస్తారనేది ఈ వీడియో చూపుతుంది. అయితే, ఈ నిషేధం కేవలం ఆలయాలకు 250 మీటర్ల పరిధి వరకు మాత్రమే వర్తిస్తుందని నగర పాలక సంస్థ తరువాత స్పష్టం చేసింది. ఈ సంవత్సరం ఇటువంటి ఉత్తర్వులు జారీ అయినట్లు ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా వైరల్ వీడియోకి సంబంధించిన వివరాలను ఇంటర్నెట్లో వెతకగా, దీనికి సంబంధించిన పూర్తి వీడియో 05 ఏప్రిల్ 2022 న ‘Headlines India’ అనే ఫేస్ బుక్ ఛానెల్లో ప్రత్యక్షప్రసారం అయినట్లు గుర్తించాము. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ప్రాంతంలో రంజాన్ మాసంలో మాంసం దుకాణాలను మూసివేయగా అక్కడి ప్రజల స్పందన ఎలా ఉంది అనేది ఈ ఇంటర్వ్యూలో చూడవచ్చని వీడియో కింద వివరణలో పేర్కొన్నారు.

వార్తా కథనాల ప్రకారం, 2022లో ఏప్రిల్ 02 నుంచి ఏప్రిల్ 10 వరకు, చైత్ర నవ రాత్రుల సందర్భంగా ఘజియాబాద్ నగర పాలక సంస్థ జిల్లాలో మాంసం విక్రయాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులను వెంటనే సవరిస్తూ కేవలం ఆలయాలకు 250 మీటర్ల పరిధిలో మాత్రమే ఈ నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ఈ సంవత్సరం చైత్ర నవరాత్రుల సందర్భంగా మాంస విక్రయాలను నిషేధిస్తున్నట్లు ఎక్కడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు.

చివరిగా, 2022లో ఘజియాబాద్ ప్రాంతంలో చైత్ర నవరాత్రి సందర్భంగా చేసిన మాంస నిషేధానికి సంబంధించిన వీడియోని 2023లో రంజాన్ మాసం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాంస నిషేధం చేసిందంటూ తప్పుడు ప్రచారం జరుగుతుంది.

Share.

About Author

Comments are closed.

scroll