పవిత్రమైన పగోడా/మహామేరు పుష్పాలు హిమాలయాల్లో 400 ఏళ్ళకు ఒకసారి వికసిస్తాయి అని చెప్తూ, ఒక వీడియోను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోలో చూపిస్తున్న పువ్వుకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: హిమాలయాల్లో 400 ఏళ్ళకు ఒకసారి వికసించే పగోడా/మహామేరు పువ్వు వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో కనిపించేది ఫాక్స్ టైల్ లిల్లీస్ అనే మొక్క. ఇవి పశ్చిమ మరియు మధ్య ఆసియాకు చెందినవి. సాధారణంగా ఈ మొక్కలు వసంతకాలం చివరి నుండి వేసవి కాలం ప్రారంభం వరకు వికసిస్తాయి. ఐతే పగోడా అనే పేరుతో ఒక పువ్వు నిజంగానే ఉన్నప్పటికీ, ఇవి కూడా అరుదైన పూలు కావు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది ఫాక్స్ టైల్ లిల్లీస్ (Foxtail Lilies) అనే మొక్క, పోస్టులో చెప్తున్నట్టు పగోడా పుష్పం కాదు. ఈ మొక్కకు సంబంధించి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇవి పశ్చిమ మరియు మధ్య ఆసియాకు చెందినవి. ఎరెమురస్ (Eremurus) అనేది ఈ మొక్క సైంటిఫిక్ పేరు.
పోస్టులో చెప్తున్నట్టు ఇవి అరుదుగా కనిపించే పుష్పాలేమి కావు. ఇప్పుడు ఇవి ఇంటర్నెట్ ద్వారా కూడా ఈ మొక్కలు విక్రయిస్తున్నారు.
సాధారణంగా ఈ మొక్కలు వసంతకాలం చివరి నుండి వేసవి కాలం ప్రారంభం వరకు వికసిస్తాయి. ఇవి పలు రకాల రంగుల్లో మరియు ఎత్తుల్లో ఉంటాయి. ఇవి 8 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ మొక్కలకు సంబంధించి మరింత సమాచారం ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ మొక్కల పెంపకానికి సంబంధించి ఇంటర్నెట్‌లో చాలా వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి.
పగోడా పుష్పం:
ఐతే పగోడా అనే పేరుతో ఒక పువ్వు నిజంగానే ఉంది. క్లెరోడెండ్రమ్ పానిక్యులాటం (Clerodendrum paniculatum) అనే సైంటిఫిక్ పేరు గల ఈ పుష్పాలు ఆగ్నేయ చైనాకు చెందినవి. ఐతే ఈ పుష్పాలు వేసవి మధ్య నుండి వసంతకాలం వరకు వికసిస్తాయి.
ఇంతకుముందు కూడా ఇలానే అరుదైన పువ్వులంటూ తప్పుడు సమాచారం షేర్ చేసారు:
గతంలో ఇలానే అరుదైన పువ్వులంటూ చాలా ఫోటోలో సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. హిమాలయాల్లో తరచుగా కనిపించే ‘సిక్కిం రబర్బ్’ పువ్వును 400 ఏళ్ళకి ఒకసారి హిమాలయాల్లో కనిపించే ‘మహామేరు ఆర్యపుష్పం’ అంటూ షేర్ చేసారు.
భారత దేశంలో సాధారణంగానే కనిపించే Cycads అనే జాతికి చెందిన సీడ్ ప్లాంట్‌ను హిమాలయాల్లో 99 సంవత్సరాలకు ఒక్క సారి మాత్రమే బయటికి వచ్చే శివలింగ పుష్పం అంటూ షేర్ చేసారు.
అమెరికాలో సాధారణంగా కనిపించే ‘సాగురో’, ‘సాల్వియా హాట్ లిప్స్’ పువ్వును కూడా హిమాలయాల్లో అరుదుగా కనిపించే మహామేరు పువ్వు అంటూ షేర్ చేసారు.
చివరగా, సాధారణంగా కనిపించే ఫాక్స్ టైల్ లిల్లీస్ మొక్కను హిమాలయాల్లో అరదుగా కనిపించే పువ్వు అంటూ షేర్ చేస్తున్నారు.