హిమాలయాలో 99 సంవత్సరాలకు ఒక్క సారి మాత్రమే బయటికి వచ్చే శివలింగ పుష్పం యొక్క ఫోటో, అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హిమాలయాల్లో 99 సంవత్సరాలకు ఒక్క సారి మాత్రమే బయటికి వచ్చే శివలింగ పుష్పం యొక్క ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫోటోలో కనిపిస్తున్నది Cycads అనే జాతికి చెందిన సీడ్ ప్లాంట్ అని విశ్లేషణలో తెలిసింది. భారత దేశంలో ఈ జాతికి చెందిన చెట్లు సాధారణంగానే పెరుగుతుంటాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, శివలింగ ఆకారంలో ఉన్న ఈ పుష్పం ఫోటో ‘bing’ సెర్చ్ ఇంజిన్ వెబ్సైటులో దొరికింది. ఈ ఫోటోలో కనిపిస్తున్నది ‘Cycas Nayagarhensis’ అనే Cycads కోవకి చెందిన విత్తనపు మొక్క అని అందులో తెలిపారు. భారత దేశంలోని ఒడిషా రాష్ట్రంలో కనుగొన్న ఈ మొక్క అంతర్జాతీయ Cycads ఫ్యామిలీ లో భాగమైనట్టు అందులో తెలిపారు. ఈ మొక్కకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్ లో వెతకగా, ‘Cycas Nayagarhensis’ ఇంకా ‘Cycas Orixensis’ అనే Cycads కోవకు చెందిన రెండు కొత్త రకమైన విత్తనపు మొక్కలని 2015లో భారత శాస్త్రవేత్తలు రీటా సింగ్, P. రాధా, J.S ఖురైజం ఒడిషా రాష్ట్రంలో కనుగొన్నట్టు తెలిసింది. ‘Research Gate’ వెబ్సైటులో, సైంటిస్ట్ రీటా సింగ్ తమ రీసెర్చ్ కు సంబంధించి అప్లోడ్ చేసిన ఫోటోలు దొరికాయి. తమ రీసెర్చ్ కి సంబంధించిన డాక్యుమెంట్ ని కూడా ఈ వెబ్సైటులో షేర్ చేసారు. ఒడిషా రాష్ట్రంలోని నయాగర్ జిల్లాలో ఈ మొక్కని కనుగొన్నందున, ఈ మొక్కకి ‘Cycas Nayagarhensis’ అనే పేరు పెట్టారు.
Cycads జాతికి చెందిన 13 రకాల చెట్లు భారత దేశంలో ఉన్నట్టు ‘Cycads of India’ వెబ్సైటులో తెలిపారు. ఇవి సాధారణంగానే మన దేశంలో పెరుగుతుంటాయి అని అందులో తెలిపారు. Cycads జాతికి చెందిన మరికొన్ని రకాల మొక్కల ఫోటోలు ‘shutterstock’ వెబ్సైటులో దొరికాయి. అవి ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, భారత దేశంలో సాధారణంగా పెరిగే ఒక విత్తనపు మొక్కని చూపిస్తూ హిమాలయాల్లో 99 సంవత్సరాలకు ఒక్క సారి మాత్రమే బయటికి వచ్చే శివలింగ పుష్పం అని షేర్ చేస్తున్నారు.