Fake News, Telugu
 

సంబంధం లేని వీడియోని బ్రెజిల్ దేశంలో యేసు క్రీస్తుని హేళన చేసిన బైకర్లను అగ్ని దహించి వేసిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

బ్రెజిల్‌లో వార్షిక కార్నివాల్‌లో దేవుడిని ఎగతాళి చేయడంతో సంతృప్తి చెందకుండా, బైకర్ల గుంపు PRAYER (ప్రార్థన) చేస్తున్న వ్యక్తులను చంపడానికి చర్చి వద్దకు వచ్చింది. అకస్మాత్తుగా, ఆకాశం నుండి అగ్ని దిగి, ప్రార్థన చేస్తున్న వ్యక్తులకు తాకకుండా వారందరినీ కాల్చివేసింది”, అంటూ ఒక వీడియో లింకుని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. యేసు క్రీస్తును తక్కువ దేవునిగా చులకనగా చూసే వ్యక్తుల కోసం ఈ వీడియోని తప్పక చూడండి అంటూ పోస్టులో తెలుపుతున్నారు. అగ్నిప్రమాదంలో చనిపోయిన శవాలను చూపిస్తున్న వీడియోని ఈ పోస్టులో షేర్ చేశారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బ్రెజిల్ దేశంలో యేసు క్రీస్తుని హేళన చేసిన బైకర్లను ఆకాశం నుండి ఎగసిపడిన అగ్ని దహించివేసిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): బ్రెజిల్ దేశంలో యేసు క్రీస్తుని హేళన చేసిన బైకర్లు ఇటీవల అగ్ని ప్రమాదంలో చనిపోయినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు. ఆఫ్రికాలోని టాంజానియా మరియు సియర్రా లియోన్ దేశాలలో చోటుచేసుకున్న పాత అగ్నిప్రమాద దుర్ఘటన దృశ్యాలను పోస్టులో షేర్ చేసిన వీడియో చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన వీడియోకి బ్రెజిల్‌ దేశానికి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

బ్రెజిల్ దేశంలో యేసు క్రీస్తుని హేళన చేసిన బైకర్లు ఇటీవల అగ్ని ప్రమాదంలో చనిపోయినట్టు ఇంటర్నెట్లో ఇటీవల ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు.

వీడియోలోని మొదటి భాగం:

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలతో పోలి ఉన్న వీడియోలను ‘Al Jazeera’ వార్తా సహా పలు వార్తా సంస్థలు 2019 ఆగస్టు నెలలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. టాంజానియా రాజధాని దార్ ఎస్ సలామ్ నగరం సమీపంలోని మొరగోరో పట్టణంలో ఆయిల్ ట్యాంకర్ పేలి 62 మంది దుర్మరణం చెందినట్టు ఈ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

ప్రమాదానికి గురైన ట్యాంకర్ నుంచి పెట్రోల్ తీసుకెళ్ళే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు పలు వార్తా సంస్థలు 2019లో ఆర్టికల్స్ మరియు వీడియోలను పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో టాంజానియా దేశంలో చోటుచేసుకున్న పాత అగ్నిప్రమాద దుర్ఘటన దృశ్యాలను చూపిస్తుందని, ఈ వీడియో బ్రెజిల్ దేశానికి సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

వీడియోలోని రెండవ భాగం:

వీడియోలోని రెండవ భాగంలో కనిపిస్తున్న దృశ్యాలు 2021లో సియర్రా లియోన్ దేశంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం దృశ్యాలను చూపిస్తుందని తెలిసింది. సియర్రా లియోన్‌ రాజధాని ఫ్రీటౌన్‌లో ఆయిల్ ట్యాంకర్ పేలి 90 మందికి పైగా మరణించారని ఇవే దృశ్యాలు కలిగిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ దుర్ఘటనకు సంబంధించి పబ్లిష్ చేసిన మరికొన్ని వార్తా రిపోర్టులను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా వీడియోలోని రెండవ భాగంలో కనిపిస్తున్న దృశ్యాలు కూడా బ్రెజిల్ దేశానికి సంబంధించినవి కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని వీడియోని బ్రెజిల్ దేశంలో యేసు క్రీస్తుని హేళన చేసిన బైకర్లను ఆకాశం నుండి ఎగసిపడిన అగ్ని దహించి వేసిన దృశ్యలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll