Fake News, Telugu
 

తనిష్క్ కంపెనీ ‘ఏకత్వం’ యాడ్ నేపథ్యంలో చేసిన ప్రకటనని వ్యతిరేకిస్తూ జామా మసీదు ఫత్వా జారీ చేయలేదు

0

తనిష్క్ కంపెనీకి వ్యతిరేకంగా జామా మసీదు మౌలానా ఫత్వా జారీ చేసినట్టు క్లెయిమ్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనిష్క్ ‘ఏకత్వం’ అనే నినాదంతో చేసిన ప్రకటన ఇటీవల పెద్ద వివాదం అయిన విషయం మనందరికీ తెలుసు. ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చిన కోడలికి తన ముస్లిం అత్త గారు హిందూ సంప్రదాయంలో శ్రీమంతం చేస్తున్న దృశ్యాలు ఈ ప్రకటనలో చూపెట్టారు. ఈ ప్రకటనకి హిందువుల నుంచి వ్యతిరేకత ఎదురవడంతో, ఆ వీడియోని తనిష్క్ యాజమాన్యం ఇంటర్నెట్ నుంచి తీసేసారు. ఈ నేపథ్యంలో, ఈ ప్రకటనపై  జామా మజిదు యాజమాన్యం కూడా వ్యతిరేకత తెలుపుతూ ఫత్వా జారీ చేసిందంటూ ఈ పోస్ట్ వైరల్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

వైరల్ పోస్ట్ ఆధారంగా తీసుకొని కొందరు తనిష్క పై జామా మజిదు ఫత్వా జారీ చేసిందంటూ యూట్యూబ్ లో వీడియోలు కూడా పెట్టారు.

క్లెయిమ్: తనిష్క్ జ్యువేలర్స్ ‘ఏకత్వం’ యాడ్ ని వ్యతిరేకిస్తూ జామా మసీదు ఫత్వా జారీ చేసింది.

ఫాక్ట్ (నిజం):  తనిష్క్ కి వ్యతిరేకంగా ఫత్వా జారి చేసినట్టు జామా మసీదు యాజమాన్యం ఎక్కడా ప్రకటించలేదు. ఈ ఫత్వాకి సంబంధించిన సమాచారం ఏ న్యూస్ ఆర్టికల్స్ లో పబ్లిష్ అవ్వలేదు. కావున, పోస్టులో చేస్తున్న ఈ క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న ఈ క్లెయిమ్ కి సంబంధించిన వివరాల కోసం వెతకగా, తనిష్క్ జ్యువేలర్స్ కి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేస్తునట్టు జామా మసీదు యాజమాన్యం ఎక్కడ ప్రకటించలేదని తెలిసింది. ఈ ఫత్వాకి సంబంధించిన సమాచారం ఏ న్యూస్ ఆర్టికల్స్ లో పబ్లిష్ అవ్వలేదు. దీనిబట్టి పోస్టులో చేస్తున్న ఈ క్లెయిమ్ కల్పితమని మనం చెప్పవచ్చు.

తనిష్క జ్యువేలర్స్ ‘ఏకత్వం’ నేపధ్యంలో చేసిన ప్రకటనని అభినందిస్తూ ఢిల్లీ జామా మజిదు డిప్యూటీ షాహీ ఇమాం సయ్యద్ శభాన్ భుకారి తన అధికారిక ఫేస్బుక్ పేజిలో ‘14 అక్టోబర్ 2020’ నాడు ఒక పోస్ట్ పెట్టారు. తనిష్క జ్యువేలర్స్ చేసిన ఈ ప్రకటన ఆద్భుతంగా ఉన్నట్టు ఆ పోస్టులో పేర్కొన్నారు.

చివరగా, తనిష్క్ జ్యువేలర్స్ ‘ఏకత్వం’ నేపథ్యంలో చేసిన ప్రకటనని వ్యతిరేకిస్తూ జామా మజిదు ఫత్వా జారీ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll