Fake News, Telugu
 

సాయిబాబా మందిరాలలో నమాజ్ సమయంలో హారతులు సమర్పిస్తారన్న వాదనలో నిజం లేదు

0

“సాయిబాబా మందిరాలలో ఐదుసార్లు హారతి ఉంటుందని, ఈ హారతులు నమాజ్ సమయంలో ఉంటుందని” చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సాయిబాబా మందిరాలలో ఐదుసార్లు హారతి ఉంటుంది, ఈ హారతులు నమాజ్ సమయంలో సాయిబాబాకు సమర్పిస్తారు.

ఫాక్ట్(నిజం): సాయిబాబా మందిరాలలో నమాజ్ సమయంలో హారతులు ఇస్తారు అనే వాదనలో ఎలాంటి నిజం లేదు. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, షిర్డీ వారి ప్రకారం, షిర్డీలో, సాయిబాబాకు ప్రతిరోజూ ఐదుసార్లు హారతి (ఆర్తి) సమర్పిస్తారు. ఉదయం 5.00 గంటలకు “కాకడ్ హారతి”, ఉదయం 6.20 గంటలకు “ ‘షిర్డీ మాఝే పంఢారాపూర్’ హారతి”, మధ్యాహ్నం 12.00 గంటలకు “మధ్యాహ్న హారతి”, సూర్యాస్తమయం సమయంలో “ధూప్ హారతి”, రాత్రి 10.00 గంటలకు “షేజ్ హారతి” సాయిబాబాకు సమర్పిస్తారు. ముస్లింలు రోజుకు ఐదుసార్లు నమాజ్ (ఫజ్ర్, జుహర్, అసర్, మగ్రిబ్, ఇషా) చేస్తారు. అయితే, నమాజ్  సమయాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. సూర్యోదయం మరియు సూర్యాస్తమయం ఆధారంగా నమాజ్ సమయాలు మారుతూ ఉంటాయి. కాశీలోని శ్రీకాశివిశ్వనాథ్ ఆలయం వంటి పలు ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలలో కూడా ప్రతి రోజు ఐదుసార్లు హారతి ఉంటుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ పోస్ట్‌లో చెప్పినట్లుగా, సాయిబాబా మందిరాలలో ఐదుసార్లు కార్యక్రమం ఉంటుందా? లేదా? అని తెలుసుకోవడానికి మేము శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, షిర్డీ వారి అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాము. ఈ వెబ్‌సైట్‌లో షిరిడీలో సాయిబాబాకు ప్రతిరోజూ చేసే పూజ కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు పేర్కొనబడ్డాయి.ఈ వెబ్‌సైట్‌ ప్రకారం, షిర్డీలో, సాయిబాబాకు ప్రతిరోజూ ఐదుసార్లు హారతి(ఆర్తి) సమర్పిస్తారు. ఉదయం 5.00 గంటలకు “కాకడ్ హారతి”, ఉదయం 6.20 గంటలకు “ ‘షిర్డీ మాఝే పంఢారాపూర్’ హారతి”, మధ్యాహ్నం 12.00 గంటలకు “మధ్యాహ్న హారతి”, సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయం సమయంలో “ధూప్ హారతి” (ఈ హారతి సమయం సూర్యాస్తమయ సమయాన్ని బట్టి మారుతుంది), రాత్రి 10.00 గంటలకు “షేజ్ హారతి” సాయిబాబాకు సమర్పిస్తారు. ఇదే విషయమై మరింత సమాచారం కోసం శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, షిర్డీ వారిని సంప్రదించగా, వారు కూడా షిర్డీలో, సాయిబాబాకు ప్రతిరోజూ ఐదుసార్లు హారతి(ఆర్తి) సమర్పిస్తామని తెలియజేశారు, అలాగే కాకడ్ హారతి, మధ్యాహ్నన హారతి, ధూప్ హారతి, షేజ్ హారతి లను ముఖ్యమైన హారతులని,  ఉదయం 6.20 గంటలకు ఇచ్చే “ ‘షిర్డీ మాఝే పంఢారాపూర్’ హారతి చిన్న హారతి అని వారు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం అనగా 13 సెప్టెంబర్ 2024న సూర్యాస్తమయం సమయంలో  ఇచ్చే “ధూప్ హారతి” సాయంత్రం 6:45 గంటలకు ఇస్తారని తెలియచేసారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, షిర్డీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఈ హారతి కార్యక్రమాలను మనం చూడవచ్చు(కాకడ్ హారతి, ‘షిర్డీ మాఝే పంఢారాపూర్’ హారతి, మధ్యాహ్న హారతి, ధూప్ హారతి, షేజ్ హారతి).

ఇకపోతే ముస్లింలు రోజుకు ఐదుసార్లు నమాజ్ (ఫజ్ర్, జుహర్, అసర్, మగ్రిబ్, ఇషా) చేస్తారు. అయితే, నమాజ్  సమయాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. సూర్యోదయం మరియు సూర్యాస్తమయం ఆధారంగా నమాజ్ సమయాలు మారుతూ ఉంటాయి. ప్రాంతాలను బట్టి కూడా మారుతూ ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో నేటి నమాజ్ సమయాలు ఫజ్ర్: 4:52 AM, జుహర్(ధుహ్ర్): 12:12 PM, అసర్: 3:34 PM, మగ్రిబ్: 6:20 PM, మరియు ఇషా:7:33 PM. అలాగే మనం 01 జనవరి 2024 నమాజ్ సమయాలు పరిశీలిస్తే, అవి ఫజ్ర్: 5:29 AM, జుహర్: 12:19 PM, అసర్: 3:30 PM, మగ్రిబ్: 5:53 PM మరియు ఇషా: 7:10 PM గా ఉన్నాయి.   

ఫజ్ర్: ఫజ్ర్ అనగా సూర్యోదయం సమయం. సూర్యోదయానికి ముందు ఆచరించే నమాజ్ ని ఫజ్ర్ నమాజ్ లేదా ‘సలాతుల్ ఫజ్ర్’(అరబిక్) అని అంటారు.

జుహర్: జుహర్ అనగా మధ్యాహ్న సమయం. సూర్యుడు నడినెత్తినవచ్చి పడమట పయనించే సమయం. ఈ సమయంలో ఆచరించే నమాజ్ ని జుహర్ నమాజ్, లేదా నమాజ్ ఎ జుహర్, లేదా ‘సలాతుల్ జుహర్’ (అరబిక్) అని అంటారు.

అసర్: అసర్ అనగా మధ్యాహ్నము, సూర్యాస్తమయ సమయానికి మధ్య గల సమయం, సాయంకాలం. ఈ సమయంలో ఆచరించే నమాజ్ ని అసర్ నమాజ్, లేదా నమాజె అసర్, లేదా సలాతుల్ అసర్ (అరబిక్) అని అంటారు.

మగ్రిబ్: మగ్రిబ్ అనగా సూర్యాస్తమయ సమయం.సూర్యుడు అస్తమించిన వెనువెంటనే ఆచరించే నమాజ్. దీనిని మగ్రిబ్ నమాజ్, లేదా నమాజె మగ్రిబ్, లేదా సలాతుల్ మగ్రిబ్ (అరబిక్) అని అంటారు.

ఇషా: సూర్యాస్తమయ సమయం నుండి, అర్ధరాత్రి వరకు ఆచరించే నమాజుని ఇషా నమాజ్, లేదా నమాజె ఇషా, లేదా సలాతుల్ ఇషా (అరబిక్) అని అంటారు.(ఇక్కడ)

కాశీలోని శ్రీకాశివిశ్వనాథ్ ఆలయం వంటి పలు ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలలో కూడా ప్రతి రోజు ఐదుసార్లు హారతి ఉంటుందని మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ). ఈ సమాచారం ఆధారంగా సాయిబాబా మందిరాలలో హారతులు నమాజ్ సమయంలో ఇస్తారనే వాదనలో ఎలాంటి నిజం లేదని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, సాయిబాబా మందిరాలలో నమాజ్ సమయంలో హారతులు సమర్పిస్తారన్న వాదనలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll