Fake News, Telugu
 

ఈ వీడియోలోని హిందూ యువతిని మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా హిందువే, ముస్లిం కాదు

0

అప్పటికే పెళ్ళై పిల్లలున్న ఒక ముస్లిం వ్యక్తి మరొక హిందూ యువతిని మోసం చేసి పెళ్లిచేసుకున్నాడు, ఈ విషయం తెలిసిన ఆ యువతీ ఆ వ్యక్తితో గొడవపడింది అని చెప్తూ, దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అప్పటికే పెళ్ళై పిల్లలున్న ఒక ముస్లిం వ్యక్తి మరొక హిందూ యువతిని మోసం చేసి రెండో పెళ్లిచేసుకున్నాడు.

ఫాక్ట్(నిజం): పోస్టులో చెప్పినట్టు అప్పటికే పెళ్ళై పిల్లలున్న వ్యక్తి వేరొక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్న వార్త నిజమైనప్పటికీ ఆ వ్యక్తి ముస్లిం అన్న వార్తలో నిజం లేదు. వీడియోలో గొడవపడుతున్న భార్యాభర్తలిద్దరూ హిందువులే. ఇదే విషయం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్టు ASI మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే ఫోటోలు ప్రచురించిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఇండోర్ లోని చ్చోట బంగారడ కి చెందిన ఆనంద్ పాటిల్ తనకు పెళ్ళై పిల్లలున్న విషయాన్నీ దాచిపెట్టి మరొక మహిళను పెళ్లిచేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకొని ఆ మహిళా అతనికి చెందిన మిల్క్ పార్లర్ ధ్వంసం చేసి, అతనితో గొడవ పడింది. ఈ వార్తా కథనం ఇక్కడ చదవొచ్చు.

ఇంకా ఈ వార్తా కథనంలో ఆనంద్ పాటిల్ అనే వ్యక్తి తనకు పెళ్ళైన విషయాన్ని దాచి పెట్టి  తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని వీడియోలో ఉన్న యువతి ‘bhanvarkuan’ పోలీస్ స్టేషన్ కి చెందిన జగదీష్ మాల్వియా అనే ASIకి తెలిపినట్టు రాసుంది. ఇదే విషయం ASI మీడియాకి తెలుపుతున్న వీడియో ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఈ వీడియోలో ఆ అమ్మాయి తన పేరు నేహా పాటిల్ అని, తనని మోసం చేసి పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు ఆనంద్ పాటిల్ అని  చెప్పడం చూడొచ్చు. దీన్నిబట్టి ఈ వీడియోలో గొడవ పడుతున్న బార్యాభర్తలీద్దరు హిందువులేనని కచ్చితంగా చెప్పొచ్చు.

ఇటీవలే విడుదలైన తనిష్క్ జెవెల్లరీ యాడ్ లవ్ జిహాద్ ని ప్రోత్సహిస్తుందన్న కారణంతో వివాదాస్పదం అయిన నేపథ్యంలో పోస్టులో ఉన్న వార్తలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. 

చివరగా, పోస్టులో చెప్పినట్టు పెళ్ళైన వ్యక్తి మోసం చేసి వేరొక అమ్మయిని పెళ్లి చూసుకున్న వార్త నిజమైనప్పటికీ  ఈ వ్యక్తి ముస్లిం అన్న వార్తలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll