Fake News, Telugu
 

ప్రభుత్వాలు చేసిన అప్పులను ప్రజాప్రతినిధుల సొంత ఆస్తుల నుండి చెల్లించాలని చెప్పే చట్టమేది లేదు, అటువంటి ప్రతిపాదన కూడా లేదు

0

‘అన్ని రాష్టాల ముఖ్యమంత్రులు విచ్చలవిడిగా అప్పులు చేసి జనాలమీద వేస్తున్నారు కాబట్టి అన్ని రాష్టాల ముఖ్యమంత్రులు వాళ్ల ఐదు సంవత్సరాల పదవీ కాలంలో చేసిన అప్పులు ఆ ఐదు సంవత్సరాల పదవీ కాలంలోనే తీర్చలి లేకపొతే అది వాళ్ల సొంత అప్పుగా పరిగణించి వాళ్ళ పార్టీకి సంబంధించిన బంధువులు, MLAలు, MPలు,  మంత్రులు ఆస్తులను జప్తు చేసేలా, ఇంకా అప్పు తీరకపోతే అరెస్ట్ చేసి దోపిడీ దొంగకు చట్టపరంగా ఎలాంటి శిక్ష వేస్తారో అదే శిక్ష విధించేలా’ చట్టాన్ని తీసుకోస్తున్నారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: రాష్ట్రాలు చేస్తున్న అప్పులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త చట్టం యొక్క వివరాలు.

ఫాక్ట్(నిజం): ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు FRBM పరిమితులను దాటి అప్పులు చేస్తున్నాయి. ఐతే ఇలా ప్రభుత్వాలు చేసిన అప్పులను ప్రజాప్రతినిధుల సొంత ఆస్తుల నుండి చెల్లించాలని చెప్పే చట్టమేది లేదు. అలాంటి ప్రతిపాదన ఉన్నట్టు కూడా ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి ప్రభుత్వాలు చేసిన అప్పులు రాష్ట్ర ఖజానా నుండే చెల్లిస్తారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఒక చట్టం తీసుకొస్తున్నట్టు ఎటువంటి సమాచారం లేదు. పైగా ఈ వార్తా 2018 నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 2018లో ఇదే విషయాన్ని షేర్ చేసిన పోస్టులు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ పోస్టులో చెప్తున్నట్టు ప్రజాభిప్రాయ సేకరణ జరిగి ఉంటే లేక అలాంటి ప్రతిపాదనేదైనా ఉండి ఉంటే, వార్తా సంస్థలు దినికి సంబంధించిన వార్తల గురించి ప్రచురించేవి, కాని మాకు అటువంటి వార్తా కథనాలేవి కనిపించలేదు. 2018 నుండే వచ్చే మార్చి నెలలో ప్రజాభిప్రాయ సేకరణ అని ఇదే పోస్ట్ షేర్ చేస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు అటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఏదీ జరగలేదు.

నిజానికి ప్రభుత్వాలు ఆర్థిక నియంత్రణ పాటించకపోవడం అనేది ఇటీవల కాలంలో తరచూ జరుగుతుంది. రాష్ట్రాల, దేశ బడ్జెట్‌లో కొంత వరకు అప్పులకు వడ్డీలు కట్టడంపై ఖర్చు చేయవలసి వస్తుంది. మౌళిక సదుపాయాల కల్పనపై కాకుండా ఇలా ఉత్పాదకత లేని వాటిపై ఖర్చు చేయడం వల్ల దీర్ఘకాలంలో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అతీతం ఏమి కాదు. ఆర్థిక నియంత్రణ పాటించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ అప్పులు కూడా పెరిగిపోతున్నాయి, GDPలో (స్థూల జాతీయోత్పత్తి) ఫిస్కల్ డెఫిసిట్ శాతం కూడా పరిమితులు దాటుతున్నాయి. కాకపోతే పోస్టులో చెప్తునట్టు ప్రభుత్వాలు చేసిన అప్పులను ప్రజాప్రతినిధుల సొంత ఆస్తుల నుండి చెల్లించడం అనేది ఉండదు, అప్పులు ఎప్పుడైనా ప్రభుత్వ ఖజానా నుండే చెల్లిస్తారు. రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాల అప్పుల వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వాలు పాటిస్తున్న నియమాలు కింద చూద్దాం.

ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ మేనేజ్మెంట్ (FRBM):

సాధారణంగా ప్రతీ సంవత్సరం ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ప్రభుత్వ రాబడి కన్నా వ్యయం అధికంగా ఉంటూ, రెండిటి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇలా రాబడితో పోలిస్తే బడ్జెట్‌లో వ్యయం మించిన పక్షంలో ఆ వ్యత్యాసాన్ని ఫిస్కల్ డెఫిసిట్ (ద్రవ్య లోటు)గా పరిగణిస్తారు. ప్రభుత్వాలు ఈ లోటుని అప్పుల ద్వారా పూడుస్తాయి. ఐతే ప్రతీ సంవత్సరం ఈ ఫిస్కల్ డెఫిసిట్‌ని భర్తీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తుండడంతో ప్రభుత్వాలు చెల్లించాల్సిన అప్పులు పెరిగి ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంటాయి.

ఐతే ప్రభుత్వాలు ఇలా ఇష్టానుసారంగా అప్పులు చేయకుండా, ఆర్ధిక వ్యవస్థ నియంత్రణలో ఉంచేందుకు 2003లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ మేనేజ్మెంట్ ఆక్ట్, 2003 (FRBM)ని’ తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా  కేంద్ర, రాష్ట్రాల GDPలో (స్థూల జాతీయోత్పత్తి) ఫిస్కల్ డెఫిసిట్ శాతం, GDPలో అప్పుల శాతం మొదలైన అంశాలలో పరిమితులు విధించారు. ఐతే 2017లో ఈ చట్టాన్ని పునఃసమీక్షించడానికి ఒక కమిటీని వేయగా, ఆ కమిటీ ఆర్థిక నిబంధనలకు సంబంధించి కొన్ని సవరణలు చేసి అవలంభించాల్సిన ఆర్ధిక పరిమితులను నిర్దేశించాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ కమిటీ ప్రతిపాదనలను మనం పాటిస్తున్నాం. ఈ కమిటీ ప్రతిపాదించిన పరిమితులలో కొన్ని కింద చూడొచ్చు.

  • కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం జీడీపీలో ఫిస్కల్ డెఫిసిట్ శాతాన్ని 0.3% తగ్గించుకుంటూ 2023 మార్చి 31 నాటికి ఫిస్కల్ డెఫిసిట్ (ద్రవ్య లోటును) జీడీపీలో 2.5% వరకు పరిమితం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి.
  • కేంద్ర ప్రభుత్వం సాధారణ ప్రభుత్వ రుణాలు (కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ రుణాలు) జీడీపీలో 60% మించకుండా ఉండేలా ప్రయత్నించాలి.
  • 2024-25 చివరికల్లా కేంద్ర ప్రభుత్వ రుణాలు GDPలో 40% మించకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు GDPలో 20% మించకుండా ఉండేలా ప్రయత్నించాలి.
  • ప్రతీ సంవత్సరం రెవెన్యూ (ఆదాయ) లోటును GDPలో కనీసం 0.5% తగ్గించుకుంటూ మార్చి 31, 2023 నాటికి రెవెన్యూ లోటును GDPలో 0.8 శాతానికి తగ్గించాలి.

ఐతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పడు ఈ పరిమితిని సవరిస్తూ  ఫిస్కల్ డెఫిసిట్ పరిమితులకు మించి అప్పులు చేస్తున్నాయి. ఇందువల్ల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులు ప్రతీ సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. మొదటిసారి ద్రవ్య నియంత్రణ చట్టాన్ని తెచ్చినప్పటి (2003) నుండి ఇప్పటివరకు కొంత నియంత్రణ పాటిస్తుండడం వల్ల GDPలో అప్పుల యొక్క నిష్పత్తి తగ్గుతూ వస్తున్నప్పటికీ, 2018లో నిర్దేశించిన లక్ష్యాలను మాత్రం ఇంకా చేరుకోలేదు.

చివరగా, ప్రభుత్వాలు చేసిన అప్పులను ప్రజాప్రతినిధుల సొంత ఆస్తుల నుండి చెల్లించాలని చెప్పే చట్టమేది లేదు, అటువంటి ప్రతిపాదన కూడా ఏది లేదు.

Share.

About Author

Comments are closed.

scroll