ఇజ్రాయిల్ తో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి భారతీయ ముస్లింలు తెలుపుతున్న మద్దతు తమకు అక్కర్లేదని పాలస్తీనా ప్రభుత్వం ట్వీట్ చేసినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. ‘State of Palestine’ అధికారిక ట్విట్టర్ హేండిల్ ఈ ట్వీట్ చేసినట్టు పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజమో చూద్దాం.
క్లెయిమ్: ఇజ్రాయిల్ తో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి భారతీయ ముస్లింలు తెలుపుతున్న మద్దతు తమకు అక్కర్లేదని పాలస్తీనా ప్రభుత్వం ట్వీట్ చేసింది.
ఫాక్ట్ (నిజం): పాలస్తీనా ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ హేండిల్ ‘State of Palestine’, భారతీయ ముస్లింల గురించి ప్రస్తావిస్తూ ఇటీవల ఎటువంటి ట్వీట్ పెట్టలేదు. పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ద్వారా రూపొందించింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ట్వీట్ ని పాలస్తీనా ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ హేండిల్ ‘State of Palestine’ పోస్ట్ చేసిందా అని వెతకగా, భారతీయ ముస్లింల గురించి ప్రస్తావిస్తూ ‘State of Palestine’ ట్విట్టర్ హేండిల్ ఎటువంటి ట్వీట్ పెట్టలేదని తెలిసింది. ఇజ్రాయిల్ తో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి కొందరు భారతీయ ముస్లింలు తెలుపుతున్న మద్దతు గురించి పాలస్తీనా ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించలేదు. పాలస్తీనా ప్రభుత్వం భారతీయ ముస్లింల మద్దతు తిరస్కరించిందని రిపోర్ట్ చేస్తూ ఏ ఒక్క న్యూస్ సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేయలేదు.
‘State of Palestine’ అధికారిక ట్విట్టర్ హేండిల్ యూసర్ పేరు (@Palestine_UN), పోస్టులో షేర్ చేసిన ట్వీట్ లోని యూసర్ పేరు (@Palesti..) వేర్వేరు అని గమనించవచ్చు. @Palesti… అనే యూసర్ పేరుతో ట్విట్టర్ లో ఎవ్వరు ఇంతవరకు అకౌంట్ సృష్టించుకోలేదు. ‘State of Palestine’ పేరుతో రూపొందించిన పేరడీ ట్విట్టర్ అకౌంట్లు కూడా ఈ ట్వీట్ ని పెట్టలేదని తెలిసింది. అంతేకాదు, ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ హేండిల్ ఏది ‘SHITTY’ లాంటి పదాలని ఉపయోగిస్తూ ట్వీట్ పెట్టదు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ద్వార సృష్టించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, భారతీయ ముస్లింల మద్దతుని తిరస్కరిస్తూ పాలస్తీనా ప్రభుత్వం ఎటువంటి ట్వీట్ పెట్టలేదు.