“ఆకు పచ్చని పురుగు పత్తి పొలంలో వస్తుంది అంట. ఇది కొరికిన అయిదు నిమిషాల్లో చనిపోతారు అంట. ఇది కర్ణాటకలో జరిగింది” అని చెప్తూ ఒక ఆకు పచ్చని కీటకం ఫొటో మరియు పొలంలో పత్తి చెట్ల మధ్యలో స్పృహ లేకుండా పడిఉన్న వ్యక్తుల ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇవే ఫోటోలను షేర్ చేస్తూ మహారాష్ట్రలోని భీడ్ జిల్లాలో ఈ ఘటన జరిగినది అని మరికొందరు అంటున్నారు. ఈ పోస్టులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: కర్ణాటకలోని ఒక పత్తి పొలంలో ఆకు పచ్చని పురుగు కాటుకి గురై ముగ్గురు మరణించిన దృశ్యాలు.
ఫ్యాక్ట్ (నిజం): వార్తా కథనాల ప్రకారం, ఫొటోలో ఉన్న వ్యక్తులు మహారాష్ట్ర జల్గాంవ్ కు చెందిన శివాజీ మరియు అతని కొడుకు. 09 సెప్టెంబర్ 2022న, పొలంలో పని చేస్తున్నప్పుడు వర్షం పడుతుండడంతో చెట్టుకిందకి వెళ్లారు. అదే సమయానికి పిడుగు పడటంతో, అక్కడికక్కడే మృతిచెందారు. ఫొటోలో ఉన్న పురుగుతో ఈ ఘటనకు ఎటువంటి సంబంధంలేదు. ఫోటోలో ఉన్న గొంగళి పురుగు పేరు “stinging nettle slug caterpillar”. ఈ పురుగు మనుషుల ప్రాణాలు తీసే అంత విషపూరితం అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అయితే, దీని పైన ఉన్న ముళ్ళు తాకితే చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కావున, ఈ పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా పోస్టులో ఉన్న వ్యక్తుల ఫొటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా “Zoom Marathi” యూట్యూబ్ ఛానెల్లో 9 సెప్టెంబర్ 2022 న అప్లోడు చేసిన “చాలీస్‌గావ్ | పిడుగుపాటుకు రైతు తండ్రీ కొడుకులు దురదృష్టవశాత్తు మృతి చెందారు” అని చెప్తున్న ఒక వీడియో లభించింది. ఈ వీడియో కింద వివరణలో “చాలీస్‌గావ్ తాలూకాలోని నవే గ్రామంలో మధ్యాహ్నం పొలంలో పంటలకు ఎరువులు వేయడానికి వెళ్తుండగా పిడుగు పడడంతో తండ్రికొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు” అని పేర్కొన్నారు. ఇక ఈ వీడియోలోని దృశ్యాలను వైరల్ అవుతున్న ఫొటోలతో పోల్చి చూడగా రెండూ ఒక్కటే అని చెప్పవచ్చు.
ఇదే వార్తని “Jagat News 24” యూట్యూబ్ ఛానెల్ వారు 10 సెప్టెంబర్ 2022న ప్రసారం చేశారు. అలాగే, ‘TV9 Marathi’, ‘Lokmat’, ‘Maharashtra times’ వారు కూడా ఈ వార్తని రిపోర్ట్ చేశారు. ఈ కథనాల ప్రకారం, మహారాష్ట్రలోని జల్గాంవ్ జిల్లాకు చెందిన శివాజీ చవాన్ 09 సెప్టెంబర్ 2022న తన భార్య, కొడుకుతో పొలానికి ఎరువు వేయడానికి వెళ్లారు. అదే సమయానికి వర్షం వస్తుండటంతో అక్కడే ఉన్న చెట్టు కిందకి ముగ్గురూ వెళ్లారు. కానీ, చెట్టు పైన పిడుగు పడటంతో శివాజీ మరియు అతని కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. అతని భార్య గాయపడింది.
ఇక వైరల్ అవుతున్న పోస్టులో ఉన్న ఆకు పచ్చని కీటకం గురించి వెతకగా, దాని పేరు “stinging nettle slug caterpillar” అని తెలిసింది. ఈ వెబ్సైటు లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ గొంగళి పురుగు చుట్టూ ఉన్న ముళ్ళు, దాని ఆత్మరక్షణ కొరకు ఉపయోగపడతాయి. వాటిని ఎవరైనా తాకితే దాంట్లో ఉండే రసాయనాల వలన చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ పురుగు వలన మనుషులు చనిపోయినట్లు ఎక్కడా రిపోర్ట్ కాలేదు.
చివరిగా, పిడుగుపాటు వలన మహారాష్ట్రలో చనిపోయిన వ్యక్తుల ఫోటోలను, ఆకుపచ్చ పురుగు కుట్టడం వలన చనిపోయారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
వివరణ (19 September 2022):
కృషి విజ్ఞాన కేంద్రం వారు ఇదే విషయాన్ని తప్పుడు వార్తగా తెలుపుతూ స్పష్టత ఇచ్చినట్టు ‘DD News Andhra’ వారు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేసారు. పురుగు ఎక్కువగా చెరకు, పండ్ల తోటల్లో మాత్రమే కనిపిస్తుందని, పత్తి చేనులో ఉండదని కృషి విజ్ఞాన కేంద్రం తెలిపింది. ఆ పురుగు శరీరానికి తాకితే దురద, మంట మాత్రమే వస్తుందని, చనిపోయేంత ప్రమాదం ఉండదని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఫాక్ట్ చెక్ విభాగం కూడా ఇదే సమాచారాన్ని రీట్వీట్ చేసారు.