Fake News, Telugu
 

కేరళలోని ముస్లింలు హిందువులకు పవిత్రమైన ఓంకారాన్ని నిషేధించాలని డిమాండ్ చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ కాలేదు

0

హిందువులకు పవిత్రమైన ఓంకారాన్ని నిషేధించాలని కేరళ ముస్లింలు డిమాండ్ చేశారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. పోస్ట్‌లో టైమ్స్ నౌ న్యూస్ క్లిప్ స్క్రీన్‌షాట్ ఉంది, దానిపై ఇప్పుడు ఇస్లాం మతస్తులు ఓంను వ్యతిరేకిస్తున్నారు అని రాసి ఉంది. ఈ కథనం ద్వారా ఇందులోని నిజానిజాల్ని తెలుసుకుందాం.

క్లెయిమ్: కేరళలోని ముస్లింలు హిందువులకు పవిత్రమైన ‘ఓంకారాన్ని’ ఇస్లాంకు విరుద్ధం అని, దానిని నిషేధించాలని డిమాండ్ చేశారు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్‌లో ఉన్న టీ.వీ న్యూస్ క్లిప్ యొక్క క్లిప్ కేరళలోని ఒక పాఠశాలలో జరిగిన సంఘటనపై టైమ్స్ నౌ చేసిన రిపోర్ట్ కి సంబంధించింది. ఈ సంఘటనపై మీడియా రిపోర్టుల ప్రకారం, కేరళ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు తమ పిల్లలకు మతపరమైన చిహ్నాలతో కూడిన కరపత్రాలను పంచారని తల్లిదండ్రుల నుండి ఫిర్యాదులు అందడంతో పాఠశాల నిర్వాహకులు వారిని సెలవుపై పంపారు. ఓంపై నిషేధం విధించాలని ముస్లింలు డిమాండ్ చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు. కావున, పోస్ట్‌లో చెప్తున్నది తప్పు.

వైరల్ పోస్ట్ లో టైమ్స్ నౌ రిపోర్ట్ స్క్రీన్‌షాట్ ఉంది, దీనిలో #OmNotAllowed అనే వాక్యాన్ని  చూడవచ్చు. సరైన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతుకగా టైమ్స్ నౌ యొక్క ట్విట్టర్ పోస్ట్ మరియు వార్తా కథనాలు లభించాయి. ట్విటర్ పోస్ట్‌కి ‘ #బ్రేకింగ్ | కేరళలో ‘ఓం’ను ‘ఇస్లాంవాదులు’ వ్యతిరేకిస్తున్నారు. ‘ఓం’ అని వ్రాసినందుకు ఇద్దరు ఉపాధ్యాయులు శిక్షించబడ్డారు.’ అని రాసి ఉంది. పోస్ట్‌లో ఉన్న  వీడియో రిపోర్టులో 1.50 వద్ద ఉన్న ఫ్రేమ్ పోస్ట్‌లో ఉన్న స్క్రీన్‌షాట్‌తో సరిపోతుంది.

ఈ ఘటనపై టైమ్స్ నౌ వారు రాసిన వార్తా కథనంలో కూడా అదే వీడియో ఉంది. ఫిబ్రవరి 2020లో జరిగిన ఈ సంఘటనపై అనేక ఇతర మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రచురించాయి, వీటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు. మతపరమైన చిహ్నాలతో (ఓంతో) కూడిన కరపత్రాలను పంచినందుకు కేరళలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను సెలవుపై పంపినట్లు ఈ కథనాలతో పేర్కొన్నారు.

ఈ విషయంపై పాఠశాల యాజమాన్యం విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. విద్యా శాఖ సీనియర్ అధికారి NDTVతో మాట్లాడుతూ ‘కొన్ని పార్టీల నుండి మతపరమైన ఉద్రిక్తతను రేకెత్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ స్థానికులు, పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ వారు దీన్ని వారి చేతుల్లోకి తీసుకునేందుకు అనుమతించలేదు.’ అని పేర్కొన్నారు.

వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లు, ఈ సంఘటనను కవర్ చేసిన వార్తల్లో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఎక్కడా కూడా కేరళ ముస్లింలు ఓంని నిషేధించాలని డిమాండ్ చేసినట్టు లేదు. కేరళలోని ముస్లింలు అలాంటి క్లెయిమ్‌లు చేశారో లేదో తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌లో వెతికినా, సంబంధిత సమాచారం ఏదీ లభించలేదు.

చివరిగా, ఈ సోషల్ మీడియా పోస్ట్ కేరళలోని ముస్లింలు ఇస్లాంకు విరుద్ధం అని, హిందువులకు పవిత్రమైన ‘ఓంకారాన్ని’ నిషేధించాలని డిమాండ్ చేశారని తప్పుగా పేర్కొంది.

Share.

About Author

Comments are closed.

scroll