దీపాలతో నిండిన ఒక ఆలయం మరియు దాని ప్రాంగణం ఫోటోను షేర్ చేస్తూ ఇది కార్తీక దీపంతో వైభవంగా ఉన్న అరుణాచల ఆలయం అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత వాస్తవముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ఈ ఫోటో కార్తీక పౌర్ణమి దీపంతో వైభవంగా ఉన్న అరుణాచల ఆలయానిది.
ఫాక్ట్ (నిజం): ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ ద్వారా రూపొందించబడిన ఫోటో, అరుణాచల ఆలయం ఫోటో కాదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
పోస్టులో ఉన్న ఫోటోను రివర్స్ ఇమేజ్ ద్వారా వెతికితే, శ్రీనివాసా గోవిందా అనే ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్‌కు దారితీసింది. అను శ్రీ అనే పేరు గల వ్యక్తి ఈ ఫోటోతో పాటు ఇటువంటి ఫోటోలు మరిన్ని అప్లోడ్ చేస్తూ ‘ఆర్ట్ వర్క్ బై మీ’ అని కాప్షన్ రాసి పోస్టు చేయటం గమనించాం. ఈ ప్రొఫైల్‌ను పరిశీలించగా, ఈ వ్యక్తి, తాను డిజిటల్‌గా రూపొందించిన ఫొటోలే కాకుండా ఇతరులు డిజిటల్ ఆర్ట్ ద్వారా రుపొంచిన దేవుళ్ళ ఫోటోలను షేర్ చెయ్యటం గమనించాం.
తరువాత, మేము ఈ చిత్రాన్ని హైవ్ AI డిటెక్టర్ ద్వారా పరిశీలించాము. ఈ డిటెక్టర్, చిత్రం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సును ఉపయోగించి రూపొందించిందా కాదా అని తెలియజేస్తుంది. హైవ్ డిటెక్టర్ వైరల్ ఫోటో AI ఉపయోగించి రూపొందించబడినట్లు ప్రకటించింది.
కార్తీక పౌర్ణమి రోజున తిరువణ్ణామలైలో ఉన్న అరుణాచల మందిరం యొక్క పలు అసలు ఫోటో ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, AI ద్వారా రూపొందించిన ఫోటోను ‘కార్తీక దీపంతో ఉన్న అరుణాచల ఆలయం’ అంటూ షేర్ చేస్తున్నారు.