Fake News, Telugu
 

అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని హిందువులకు సందేశం పంపినట్టు సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు.

0

22 జనవరి 2024న అయోధ్యలో జరగిన రామమందిర ప్రతిష్టాపన వేడుకకు ముందు హిందువులకు మద్దతుగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శతాబ్దాల తర్వాత మీ గౌరవాన్ని పునరుద్ధరించుకుని, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారంటూ సందేశం పంపారని అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మద్దతుగా మెలోని ఇటాలియన్ భాషలో మాట్లాడుతున్న వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రతిష్టాపన వేడుకకు ముందు హిందువులకు మద్దతుగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పంపిన వీడియో సందేశం .

ఫాక్ట్(నిజం):  వైరల్ వీడియోని జార్జియా మెలోని తన X (ట్విట్టర్)లో 15 జనవరి 2024 షేర్ చేసారు. ఈ వీడియోలో మెలోని తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు, సందేశాలు పంపినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మెలోని రామమందిర ప్రతిష్టాపన వేడుక సందర్బంగా హిందువులకు సందేశం పంపినట్టు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు.కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా వైరల్ క్లెయిమ్ గురించి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, మెలోని రామమందిర ప్రతిష్టాపన వేడుక సందర్బంగా హిందువులకు సందేశం పంపినట్టు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. ఆతర్వాత మేము EZDubs అనే రియల్ టైం AI డబ్బింగ్ టూల్ ఉపయోగించి వైరల్ వీడియోని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలోకి అనువదించగా, ఇటలీ ప్రధాని మెలోని వీడియోలో ‘సోషల్ మీడియాలో పోస్ట్‌లతో మరియు ప్రైవేట్‌ సందేశాల ద్వారా మీరు నాకు పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలకు మీ అందరికీ ధన్యవాదాలు, నేను మీ సందేశాల ద్వారా చాలా ప్రోత్సాహాన్ని పొందుతాను. మీరే నా బలం, మీ అందరిని ప్రేమిస్తున్నాను.’ అని చెప్పారు.

ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం, వైరల్ పోస్టులో షేర్ చేసిన వీడియో స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇటలీ ప్రధాని మెలోని అధికారిక X ఖాతాలో అసలు పోస్ట్‌ని కనుగొన్నాము. ఇది జనవరి 15న అప్‌లోడ్ చేయబడింది. అలాగే మెలోని అదే రోజు తన లింక్డ్‌ఇన్‌లో కూడా ఇదే  పోస్టు చేసింది. రెండు పోస్టుల్లోనూ ధన్యవాదాలు, మీరే నా బలం అని రాశారు (ఇటాలియన్ నుండి తెలుగు అనువాదం). దీన్ని బట్టి, మెలోని తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ షేర్ చేసిన వీడియోను తప్పుగా అనువదించి, రామమందిర ప్రతిష్టాపన సందర్బంగా హిందువులకు సందేశం పంపినట్టు ఆపాదిస్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు అని నిర్ధారించవచ్చు.

చివరగా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వీడియో తప్పుగా అనువదించి అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా ఆమె హిందువులకు సందేశం పంపినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll