Fake News, Telugu
 

బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ నరేంద్ర మోదీని కోహినూరు వజ్రంతో పోలుస్తూ ప్రశంసించలేదు

0

కోహినూరు వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇప్పించగలరా?”, అని ఒక భారతీయ విలేకరి ఇటీవల బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్‌ను ప్రశ్నిస్తే, “కోహినూర్ వజ్రమైతే గత ఎనిమిదేళ్ళుగా ఢిల్లీలోనే ఉంది. 7, లోకకళ్యాణ మార్గ్‌లో. మీకు కనబడనేలేదా?“, అని రిషి సునాక్ సమాధానమిచ్చారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు బాగా షేర్ అవుతోంది. 7, లోకకళ్యాణ మార్గ్‌ అనేది భారత ప్రధాని నరేంద్ర మోదీ నివసించే గృహం అడ్రస్. రిషి సునాక్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కోహినూరు వజ్రంతో పోల్చినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కోహినూరు వజ్రంతో పోలుస్తూ ప్రశంసించారు.

ఫాక్ట్ (నిజం): రిషి సునాక్ కోహినూరు వజ్రాన్ని భారత్‌కు తిరిగి పంపించే విషయంపై ఇటీవల స్పంధించినట్టు గానీ, నరేంద్ర మోదీని కోహినూరు వజ్రంతో పోలుస్తూ ప్రశంసించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన తరువాత నరేంద్ర మోదీతో జరిపిన మొట్టమొదట ఫోన్ సంభాషణలో, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. కానీ, రిషి సునాక్ నరేంద్ర మోదీని కోహినూరు వజ్రంతో పోలుస్తూ ప్రశంసించినట్టు ఏ ఒక్క వార్తా పత్రిక రిపోర్ట్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.    

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో వెతికితే, బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్, కోహినూరు వజ్రాన్ని భారత్‌కు తిరిగి పంపించే విషయంపై ఇటీవల స్పంధించినట్టు గానీ, నరేంద్ర మోదీని కోహినూరు వజ్రంతో పోలుస్తూ ప్రశంసించినట్టు గానీ ఎటువంటి న్యూస్ రిపోర్ట్స్ దొరకలేదు. ఒకవేళ భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రిషి సునాక్ అటువంటి వ్యాఖ్యలు చేసివుంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి.

బ్రిటన్ ప్రధానిగా ఇటీవల భాధ్యతలు చేపట్టిన రిషి సునాక్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ 27 అక్టోబర్ 2022 నాడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని రిషి సునాక్ ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. “యూకే మరియు భారత్ చాలా విషయాలను పంచుకుంటాయి. రానున్న రోజుల్లో భద్రత, రక్షణ మరియు ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసుకోవడం ద్వారా మన ఇరు గొప్ప ప్రజాస్వామ్యా దేశాలు ఏమి సాధించగలవో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను”, అని రిషి సునాక్ తన ట్వీట్లో తెలిపారు. నరేంద్ర మోదీని కోహినూరు వజ్రంతో పొలుస్తూ రిషి సునాక్ తన ట్విట్టర్ ఖాతాలో ఎటువంటి ట్వీట్ చేయలేదు.

రిషి సునాక్ నరేంద్ర మోదీతో జరిపిన ఫోన్ సంబాషణకు సంబంధించి బ్రిటన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కొనియాడారని ఈ ప్రకటనలో తెలిపారు. కానీ, నరేంద్ర మోదీని రిషి సునాక్ కోహినూరు వజ్రంతో పోలుస్తూ ప్రశంసించినట్టు బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ఈ ప్రకటనలో ఎక్కడా వెల్లడించలేదు.

ఇటీవల, ఎడిట్ చేసిన ‘Dainik Bhaskar’ గ్రాఫిక్ చిత్రాన్ని షేర్ చేస్తూ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, ఫాక్ట్‌లీ ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరగా, బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ నరేంద్ర మోదీని కోహినూరు వజ్రంతో పోలుస్తూ ప్రశంసించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll