Coronavirus Telugu, Fake News, Telugu
 

ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు ఆలస్యం కేవలం రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

0

మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ‘PM CARES’ ఫండ్ ద్వారా రాష్ట్రాలకు జనవరి 2021 లోనే 201.58 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నెలకొల్పాల్సిన ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పలేదని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం ‘PM CARES’ ఫండ్ ద్వారా రాష్ట్రాలకు జనవరి 2021 లోనే 201.58 కోట్ల రూపాయలను విడుదల చేసినా, మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వాలు.

ఫాక్ట్: మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ‘PM CARES’ ఫండ్ ద్వారా జనవరి 2021లో 201.58 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు విడుదల చేయలేదు. ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాల్సిన బాధ్యత కేంద్ర ఆరోగ్య శాఖకి సంబంధించిన CMSS సంస్థది. ప్లాంట్ల యొక్క సాధారణ నిర్వహణ మరియు కార్యకలాపాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల/ఆసుపత్రుల భాధ్యత. ఒకవేళ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు ఆలస్యం కేవలం రాష్ట్రాల వైఫల్యం అయితే, కొన్ని రాష్ట్రాల్లోనే ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు ఆలస్యం అయ్యుండాలి. కానీ, దేశమంతా కలిపి మంజూరు చేయబడిన 162 ఆక్సిజన్ ప్లాంట్లలో ఇప్పటివరకు 33 ప్లాంట్లు మాత్రమే పూర్తి అయ్యాయి. కావున, పోస్ట్ లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు ఆలస్యం కేవలం రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ప్రజారోగ్య ఆసుపత్రుల్లో 162 PSA మెడికల్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి 201.58 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం జనవరి 2021 లో కేటాయించినట్టు తెలిసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ నిధులు విడుదల చేసినట్టు ఎక్కడా లేదు.

కేంద్ర ఆరోగ్య శాఖకి సంబంధించిన సెంట్రల్ మెడికల్ సప్లై స్టోర్ (CMSS) వారు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లకు సంబంధించిన సేకరణ (‘procurement’) చూస్తారని PMO వారి ప్రెస్ రిలీజ్ లో చూడవొచ్చు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 201.58 కోట్ల రూపాయలల్లో 137.33 కోట్ల రూపాయలు ఆక్సిజన్ ప్లాంట్ల సరఫరా మరియు ఆరంభం (‘supply and commissioning’), మరియు CMSS యొక్క నిర్వహణ రుసుముకు కేటాయిస్తే, 64.25 కోట్ల రూపాయలు సమగ్ర వార్షిక నిర్వహణ ఒప్పందానికి (‘Comprehensive Annual Maintenance Contract’) కేటాయించినట్టు చూడవొచ్చు. ఎక్కడ ప్లాంట్లు పెట్టాలనే విషయం మాత్రం రాష్ట్రాలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు.

150 PSA (Pressure swing adsorption) మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లకు సంబంధించి CMSS వారు అక్టోబర్ 2020లో రిలీజ్ చేసిన టెండర్ డాక్యుమెంట్ ని ఇక్కడ చూడవొచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని పది ఆసుపత్రిల (ఒక్కో రాష్ట్రంలో ఐదు) పేర్లు ఆ 150 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు లిస్టులో ఉన్నట్టు చూడవొచ్చు. మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాల్సిన బాధ్యత CMSS సంస్థది. ప్లాంట్ల యొక్క సాధారణ నిర్వహణ మరియు కార్యకలాపాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలది/ఆసుపత్రిలది. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసుపత్రులు చేయాల్సిన పనులు లిస్టును టెండర్ డాక్యుమెంట్ లో చదవొచ్చు.

అయితే, మంజూరు చేయబడిన 162 ఆక్సిజన్ ప్లాంట్లలో ఇప్పటివరకు కేవలం 33 ప్లాంట్లను ఏర్పాటు చేసినట్టు 18 ఏప్రిల్ 2021 న కేంద్ర ఆరోగ్య శాఖ వారు ట్వీట్ చేసారు. ఏప్రిల్ 2021 చివరి నాటికి మరో 59, మే 2021 చివరి నాటికి మిగిలిన 80 ప్లాంట్లు ఏర్పాటు పూర్తవుతుందని తెలిపారు. ప్లాంట్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వాలు మెచ్చుకున్నాయని కూడా ట్వీట్ చేసారు. తాజాగా గచ్చిబౌలి టిమ్స్ కోవిడ్ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి కిషన్ రెడ్డి – ‘కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ పురోగతిపై అధికారులతో సమీక్షించాను’, అని ట్వీట్ చేసారు.

150 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లకు CMSS వారు అక్టోబర్ 2020లో రిలీజ్ చేసిన టెండర్ కి సంబంధించి డిసెంబర్ నెలలో ‘LOA (Letter of Acceptance)’ లను జారీ చేసినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. కావాల్సిన ప్రక్రియను అనుసరించనందున ఒక కంపెనీని తాజగా 13 ఏప్రిల్ 2021 న బ్లాక్ లిస్ట్ చేసినట్టు తెలిసింది. ‘స్క్రోల్’ వార్తాసంస్థ వారు టెండర్ దక్కించుకున్న కంపెనీలతో మాట్లాడగా, ఆసుపత్రుల వల్ల పని ఆలస్యం అవుతుందని చెప్పినట్టు తెలిసింది. ఆసుపత్రుల అధికారులు మాత్రం కంపెనీలు ఆలస్యం చేస్తున్నాయని ‘స్క్రోల్’ వారికి చెప్పినట్టు ఇక్కడ చదవొచ్చు. ఈ అంశం పై ‘ది ప్రింట్’ సంస్థ వారు ప్రచురించిన ఆర్టికల్ ని  ఇక్కడ చదవొచ్చు.

ఒకవేళ కేవలం రాష్ట్రాల వైఫల్యం అయితే, కొన్ని రాష్ట్రాల్లోనే ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు ఆలస్యం అయ్యుండాలి; కానీ, దేశమంతా కలిపి మంజూరు చేయబడిన 162 ఆక్సిజన్ ప్లాంట్లలో ఇప్పటివరకు 33 ప్లాంట్లు మాత్రమే పూర్తి అయ్యాయి. తాజాగా, ‘PM CARES’ ఫండ్ ద్వారా 551 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను దేశమాంతటా ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

PIB & MoHFW విడుదల చేసిన అధికారిక సమాచారం ఆధారంగా, 18 ఏప్రిల్ 2021 నాటికి ప్రతి రాష్ట్రానికి కేటాయించిన, ఇప్పటి వరకు నెలకొల్పిన ఆక్సిజన్ ప్లాంట్ల సంఖ్య ఈ కింది టేబుల్ లో చూడొచ్చు.

చివరగా, ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం 201.58 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేయలేదు; ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాల్సిన బాధ్యత CMSS సంస్థది.

Share.

About Author

Comments are closed.

scroll