పోలీసుని ప్రశ్నించినందుకు ఉత్తర ప్రదేశ్ లో ఒక దళిత జంటని కాల్చి చంపాడని చెప్తూ, పోలీసు దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి ఒక జంటని కాల్చి చంపుతున్న వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఉత్తర ప్రదేశ్ పోలీసుని ఎదురు ప్రశ్నించినందుకు తను ఒక దళిత జంటని కాల్చి చంపిన వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజమైన సంఘటన కాదు. హర్యానాలోని కర్నాల్ లో ఒక రెస్టారెంట్ బయట జరిగిన ఒక వెబ్ సిరీస్ కి సంబంధించిన షూటింగ్. ఇదే విషయాన్నీ కర్నాల్ SP స్పష్టం చేసాడు. కొన్ని హిందీ ప్రాంతీయ వార్తా సంస్థలు కూడా ఇదే విషయాన్నీ ప్రచురించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక పోలీస్ ఆఫీసర్ ఇదే వీడియోని షేర్ చేసిన ఒక ట్వీట్ మాకు కనిపించింది. ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజమైన ఘటన కాదని, ఇది ఒక వెబ్ సిరీస్ లోని సన్నివేశాల షూటింగ్ కి సంబంధించిందని, ఈ షూటింగ్ హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్ బయట జరిగిందని ఈ ట్వీట్ యొక్క సారాంశం. ఉత్తరప్రదేశ్ పోలీస్ కూడా ఇది ఒక వెబ్ సిరీస్ షూటింగ్ కి సంబంధించిన వీడియో అని ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో నిజమైన ఘటనగా వైరల్ అయినప్పుడు కర్నాల్ ఎస్పీ ఈ వీడియోకి సంబంధించి వివరణ ఇచ్చిన వీడియోని కర్నాల్ బ్రేకింగ్ న్యూస్ తమ ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసింది. ఈ వీడియో మీద కర్నాల్ ఎస్పీ గంగా రామ్ పునియా మాట్లాడుతూ ఇది ఒక వెబ్ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ అని, నిజమైన ఘటన కాదని స్పష్టం చేసాడు. ‘దైనిక్ భాస్కర్’ అనే మరొక వార్తా సంస్థ కూడా కర్నాల్ SP ఈ వీడియోకి సంబంధించి ఇచ్చిన వివరణను ప్రచురించిన కథనం ఇక్కడ చూడవొచ్చు.
BOOM ఫాక్ట్-చెకింగ్ ఏజెన్సీ వీడియోలో పోలీస్ పాత్రలో నటించిన వినయ్ కోహాడ్ ని సంప్రదించగా, ఈ వీడియోలో కనిపిస్తున్నది కేవలం ఆక్టింగ్ అని, ఈ వీడియోలో పోలీస్ డ్రెస్ లో ఉన్నది తానేనని స్పష్టం చేసాడు. వీటన్నిటి బట్టి, ఈ వీడియో ఒక వెబ్ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ అని, నిజమైన సంఘటన కాదని స్పష్టంగా అర్ధమవుతుంది.
చివరగా, వెబ్ సిరీస్ షూటింగ్ కి సంబంధించిన వీడియోని దళిత జంటని కాల్చి చంపిన ఉత్తర ప్రదేశ్ పోలీస్ అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.