Coronavirus Telugu, Fake News, Telugu
 

పచ్చ కర్పూరం కోవిడ్-19 ను నయం చేయదు

0

ఆధునిక వైద్య శాస్త్రంలో  కోవిడ్-19 వ్యాధి వ్యాప్తికి ప్రస్తుతం చికిత్స లేదు. వైరస్ తో పోరాడటానికి టీకాలు మాత్రమే ప్రస్తుతం మనకున్న ప్రత్యామ్నాయం. అయితే, పచ్చ కర్పూరం తక్కువ పరిమాణంలో తీసుకున్నప్పుడు కోవిడ్-19ని  నయం చేయగలదనే వాదనతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. ఈ పోస్టులో ఎంత వరకు నిజం ఉందో  ఇప్పుడు చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రతి రోజు పెసర గింజంత పచ్చ కర్పూరం తింటే కరోనా వైరస్ నయం అవుతుంది.

ఫాక్ట్ (నిజం): కర్పూరం వంటి పదార్థాలు నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి, కొంత స్వల్పకాలిక ఉపశమనం కూడా కలిగిస్తాయి. సిఫారసు చేయబడిన దాని కంటే ఎక్కువ కర్పూరం తీసుకోవడం వల్ల వికారం, వాంతులు మరియు అజీర్ణంతో సహా వివిధ జీర్ణ సమస్యలు కలిగే అవకాశం ఉంది. అయితే పచ్చ కర్పూరం కరోనా వైరస్ ను నివారించగలదని లేదా నయం చేస్తుందని నిరూపించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

కర్పూరం ఎందుకు ఉపయోగిస్తారు?

కర్పూరం FDA- ఆమోదించిన అనాల్జేసిక్ మరియు అనేస్తేటిక్. నొప్పి నివారణకై 3% నుండి 11% సాంద్రతలలో వాడాలి. ఇది రెండు రకాలు: సింథటిక్ కర్పూరం మరియు తినదగిన (పచ్చ) కర్పూరం. ఇది చర్మంపై వాడవచ్చు లేదా పీల్చుకుంటే దగ్గు, జలుబు పుండ్లకు సంబంధించిన నొప్పి, పురుగుల కుట్టడం మరియు కాటు, చిన్నగా కాలిన గాయాలు, హేమోరాయిడ్లు, చర్మ దురద లేదా చికాకు వంటి లక్షణాలను తొలగించడంలో  సమర్థవంతమైనది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వివిధ స్వీట్ల రుచిని పెంచడానికి తినదగిన (పచ్చ) కర్పూరం ఉపయోగించబడుతుంది. ఇది స్వీట్లు, పొంగల్ వంటి పదార్థాల్లో చాలా తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తారు. విక్స్ వాపోరబ్ లాంటి వాటిలో కూడా కర్పూరం ఉపయోగిస్తారు. పచ్చ కర్పూరం జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయితే  ఇది ఏదైనా వైరస్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉందని నిరూపించడానికి ఇంకా తగిన సాక్ష్యాలు లేవు

కర్పూరం యొక్క సైడ్ ఎఫెక్ట్స్

డాక్టర్లను సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారంలో పచ్చ కర్పూరం చేర్చండి. సిఫారసు చేయబడిన కర్పూరం కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల వికారం, వాంతులు మరియు అజీర్ణంతో సహా వివిధ జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. సింథటిక్ కర్పూరం ఎప్పుడూ నోటి ద్వారా తీసుకోకూడదు, ఎందుకంటే ఇది తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ మరియు కొన్నిసార్లు మరణానికి  కూడా దారితీస్తుంది. కర్పూరం విషపూరితం అయిన సంకేతాలు తీసుకున్న 5 నుండి 90 నిమిషాల్లోనే కనిపిస్తాయి. మార్కెట్లో లభించే కర్పూరం చాలావరకు సింథటిక్ మార్గంలో ఉత్పత్తి చేయబడుతుంది కాబట్టి,  దీనిని ఉపయోగించడంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కర్పూరం తక్కువ సాంద్రతతో పీల్చడం సురక్షితం అయినప్పటికీ, కర్పూరం చర్మం ఎరుపుగా మారడానికి మరియు చికాకు వంటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుంది మరియు కోవిడ్-19 ను ఏ విధంగానూ నయం చేయదు.

ఇటీవలే కరోనావైరస్ నివారణగా పచ్చ కర్పూరంను తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళైసాయి సౌందరరాజన్ ట్వీట్ ద్వారా సూచించినప్పుడు ఇలాంటి వివాదమే తలెత్తింది. ఏదేమైనా, కర్పూరం ఒక న్యూరోటాక్సిన్ మరియు ముఖ్యంగా పిల్లలలో మూర్ఛకు కారణమవుతుందనే విమర్శలను కొంతమంది చేసారు. దీని తర్వాత, అధికారులు ఆమోదించే వరకు దీనిని వినియోగించరాదని, కరోనావైరస్ చికిత్సలో దాని ప్రభావాన్ని నిరూపించడానికి ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవని ఆమె ఇంకో ట్వీట్ ద్వారా స్పష్టత ఇచ్చారు.

చివరిగా, కర్పూరం వంటి పదార్థాలు నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి, కొంత స్వల్పకాలిక ఉపశమనం కూడా కలిగిస్తాయి. అయితే అవి కరోనా వైరస్ ను నివారించగలవని లేదా నయం చేస్తాయని నిరూపించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అందువల్ల, వైద్య అధికారులు సూచించిన చికిత్సలను మాత్రమే అనుసరించడం అవసరం.

Share.

About Author

Comments are closed.

scroll