Fake News, Telugu
 

స్మార్ట్ సిటీ పథకం కింద కేంద్రం ప్రభుత్వం ఇప్పటివరకు వరంగల్ కి 196 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది

0

స్మార్ట్ సిటీ పథకం అమలులో భాగంగా వరంగల్ నగరానికి 2,300 కోట్ల రూపాయిలు మంజూరు చేసిన కేంద్రం. నరేంద్ర మోదీ సర్కారు కృషితో ప్రగతిపథంలో దూసుకెళ్తున్న ఓరుగల్లు’, అని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: స్మార్ట్ సిటీ పథకం కింద వరంగల్ నగరానికి 2,300 కోట్ల రూపాయిలు మంజూరు చేసిన కేంద్రం ప్రభుత్వం.

ఫాక్ట్: వరంగల్ నగరానికి స్మార్ట్ సిటీ పథకం కింద కేంద్రం ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 196 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చినట్టు ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ వెబ్ సైట్ లో చూడవొచ్చు. సాధారణంగా ఈ పథకంలో ఎంపికైన ఒక్కో నగరానికి ప్రతి సంవత్సరం సగటున 100 కోట్ల రూపాయిలు ఐదేళ్ళు (అంటే మొత్తం ఒక్కో నగరానికి సుమారు 500 కోట్ల రూపాయిలు) మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

‘స్మార్ట్ సిటీస్ మిషన్’ కి సంబంధించిన సమాచారాన్ని ఆ పథకానికి సంబందించిన వెబ్ సైట్ లో చూడవొచ్చు. 5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం ఎంపికైన అన్ని నగరాలకు కలిపి రూ. 48,000 కోట్లు, అంటే సంవత్సరానికి సగటున రూ. 100 కోట్లు ప్రతి నగరానికి (మిషన్ కింద ఎంపికైన నగరాలకు) ఇస్తుంది. మ్యాచింగ్ ప్రాతిపదికన సమానమైన మొత్తాన్ని రాష్ట్రం/యుఎల్‌బి (అర్బన్ లోకల్ బాడీ) అందించాలి. యుఎల్‌బిల సొంత నిధులు, ఫైనాన్స్ కమిషన్ కింద గ్రాంట్లు, మునిసిపల్ బాండ్ల వంటి వినూత్న ఫైనాన్స్ ప్రక్రియలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, మరియు రుణాలు ద్వారా అదనపు వనరులను సేకరించాలి అని ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ వెబ్ సైట్ లో చదవొచ్చు.

‘స్మార్ట్ సిటీస్ మిషన్’ పథకంలో తెలంగాణ నుండి ‘వరంగల్’ మరియు ‘కరీంనగర్’ నగరాలు ఎంపికైనట్టు ఇక్కడ చూడవొచ్చు.

ఈ పథకంలో ఎంపికైన ఒక్కో నగరానికి ప్రతి సంవత్సరం సగటున 100 కోట్ల రూపాయిలు ఐదేళ్ళు (అంటే మొత్తం ఒక్కో నగరానికి సుమారు 500 కోట్ల రూపాయిలు) మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఇంతకముందే చూసాము. కానీ, పోస్ట్ లో వరంగల్ నగరానికి 2,300 కోట్ల రూపాయిలు కేంద్రం ప్రభుత్వం స్మార్ట్ సిటీ పథకం కింద మంజూరు చేసిందని రాసి ఉంది. వరంగల్ నగరానికి స్మార్ట్ సిటీ పథకం కింద కేంద్రం ప్రభుత్వం ఎంత మంజూరు చేసిందో వెతకగా, ఇప్పటివరకు ‘గ్రేటర్ వరంగల్’ స్మార్ట్ సిటీకి కేవలం 196 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చినట్టు ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ వెబ్ సైట్ లో చూడవొచ్చు. వివిధ ప్రాజెక్టుల వివరాలు కూడా వెబ్ సైట్ లో చూడవొచ్చు.

‘గ్రేటర్ వరంగల్’ కి స్మార్ట్ సిటీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కేవలం 196 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చినట్టు రాజ్యసభ (ఫిబ్రవరి 2021 లో) మరియు లోక్ సభ (నవంబర్ 2019 లో) లో ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల్లో కూడా చూడవొచ్చు.

చివరగా, వరంగల్ కి స్మార్ట్ సిటీ పథకం కింద కేంద్రం ప్రభుత్వం ఇప్పటివరకు 196 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది.

Share.

About Author

Comments are closed.

scroll