ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ నగరంలో అతి దారుణంగా హత్యచేయబడిన మహిళకి సంబంధించిన ఫోటోలు , వీడియో, అంటూ షేర్ చేస్తున్న కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలో కనిపిస్తున్న అమ్మాయిని అక్కడున్న జనాలు సత్కరిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
![](https://factly.in/wp-content/uploads//2020/10/Hathras-rape-victimTelugu-Claim.jpg)
క్లెయిమ్: హత్రాస్ అత్యాచార బాధితురాలికి సంబంధించిన ఫోటోలు, వీడియో.
ఫాక్ట్ (నిజం): పోస్టులలో కనిపిస్తున్న అమ్మాయి హత్రాస్ అత్యాచార బాధితురాలు కాదు, ‘Safe Shop India’ అనే ఈ-కామర్స్ కంపెనీ అసోసియేట్ నజియా బేగం. ‘Safe Shop India’ కంపెనీ స్టాఫ్ నజియా బేగంని ఘనంగా ఆహ్వానిస్తున్నప్పుడు తీసిన వీడియో ఇది. కావున, పోస్టులలో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులలో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోని యూట్యూబ్ లో ఒక వ్యక్తి ‘20 ఫిబ్రవరి 2020’ నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. వీడియోలో కనిపోస్తుంది ‘Safe Shop India’ కంపెనీ కి చెందిన నజియా బేగం అని వివరణలో తెలిపారు. ఇదే వివరణతో మరొక యూసర్ కూడా ఈ వీడియోని యూట్యూబ్లో పోస్ట్ చేసారు. ఈ వివరాల ఆధారంగా ఆ వీడియోలోని వ్యక్తి గురించిన మరింత సమాచారం కోసం వెతకగా, తమ కంపెనీలో పనిచేస్తున్న నజియా బేగం యొక్క విజయ గాధని వివరిస్తూ ‘Safe Shop India’ కంపెనీ వారు తమ ఫేస్బుక్ పేజి లో పెట్టిన వీడియో దొరికింది. పోస్టులలో కనిపిస్తున్న అదే వ్యక్తి, ఈ వీడియోలో ‘Safe Shop India’ కంపెనీలో తన గెలుపుని వివరిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు.
![](https://factly.in/wp-content/uploads//2020/10/felicitation-video-of-Hathras-rape-victim-Image1.jpg)
‘Safe Shop India’ అనే ఈ-కామర్స్ కంపెనీ ఫాషన్, హెల్త్ మరియు లైఫ్ స్టైల్ కి సంబంధించిన వస్తువులను అమ్ముతుంటాయి. ‘Safe Shop India’ కంపెనీ స్టాఫ్ నజియా బేగంని ఘనంగా ఆహ్వానిస్తున్నప్పుడు తీసిన మరికొన్ని వీడియోలు ఇక్కడ , ఇక్కడ చూడవచ్చు.
![](https://factly.in/wp-content/uploads//2020/10/felicitation-video-of-Hathras-rape-victim-Image2.jpg)
చివరగా, ‘Safe Shop India’ ఈ-కామర్స్ కంపెనీ అసోసియేట్ ని హత్రాస్ అత్యాచార బాధితురాలుగా చిత్రికరిస్తున్నారు.