Fake News, Telugu
 

సంబంధం లేని ఫోటోలను దేశం లోని కోవిడ్ పరిస్థితులకు ముడిపెడ్తున్నారు

0

దేశ ప్రజలు వైద్యం అందక ఆక్సిజన్ సిలెండర్లని చేత పట్టుకొని ప్రాణాల కోసం పోరాటం చేస్తున్న దృశ్యాలు, అంటూ రెండు ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలని ఈ స్థాయికి తీసుకొచ్చారని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఇటీవల, భారత దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత దేశంలో ప్రజలు వైద్యం అందక ఆక్సిజన్ సిలెండర్లని చేత పట్టుకొని ప్రాణాల కోసం పోరాటం చేస్తున్న ప్రస్తుత దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన మొదటి ఫోటో, బంగ్లాదేశ్ లోని బరిశాల్ నగరానికి చెందినది. ఒక వ్యక్తి, తన తల్లి ఆక్సిజన్ సిలిండర్ ని భుజానికి తగిలించుకుని, ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్తున్నప్పుడు తీసినది. మరొక ఫోటో, 2018లో ఉత్తరప్రదేశ్ ఆగ్రా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ తగిలించుకొని ఒక మహిళ, అంబులన్స్ కోసం ఎదురు చూస్తున్న ఘటనకు సంబంధించింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో, దేశంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉన్న మాట వాస్తవం. కాని, ఈ ఫోటోలు ఇప్పటి పరిస్తితికి సంబంధించినవి కావు. కావున, పోస్టులోని ఫోటోలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి.

ఫోటో-1:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన ఫోటో ‘The Daily Star’ న్యూస్ సంస్థ 18 ఏప్రిల్ 2021 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో దొరికింది. బంగ్లాదేశ్ బరిశాల్ నగరానికి చెందిన జియాల్ హసన్, తన తల్లి ఆక్సిజన్ సిలిండర్ ని భుజానికి తగిలించుకుని ఆమెని ఆసుపత్రికి ఇలా మోటార్ సైకిల్ పై తీసుకెళ్ళినట్టు ఆర్టికల్ లో తెలిపారు. కరోనా బారిన పడిన తన తల్లి రెహనా బేగం ని, షేర్-ఇ-బంగ్లా ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకేళినట్టు జియాల్ హసన్ మీడియాకి తెలిపారు.

బంగ్లాదేశ్ బరిశాల్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనకి సంబంధించి పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్, వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో భారత దేశానికి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఫోటో-2:

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘ANI’ న్యూస్ సంస్థ 07 ఏప్రిల్ 2018 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 2018లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు వీడియోలో తెలిపారు. ఆగ్రా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో స్ట్రెచర్ సౌకర్యం లేకపోవడంతో, ఆక్సిజన్ సిలిండర్ తగిలించి ఉన్న ఒక వృద్ధురాలు అంబులన్స్ కోసం ఎదురుచూస్తూన్న దృశ్యాలు ఇవని వీడియో వివరణలో తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి ‘TOI సమయం’ న్యూస్ సంస్థ కూడా ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆగ్రా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ వృద్ధురాలిని వేరే వార్డుకు తరలించే క్రమంలో అంబులన్స్ రావడానికి ఆలస్యం అవ్వడంతో ఆ వృద్ధురాలు, ఆమె కుమారుడు ఆక్సిజన్ సిలిండర్ తో రోడ్డు పై ఎదురుచూసినట్టు ఆర్టికల్ లో తెలిపారు.  స్ట్రెచర్ సౌకర్యం లేకపోవడంతో రోగి కుమారుడు ఆక్సిజన్ సిలిండర్ ని తన భుజాలపై మోసుకెళ్ళినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ప్రస్తుత పరిస్థితులకి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

భారత దేశంలో కరోనా వైరస్ కేసులు లక్షలలో వస్తున్న నేపథ్యంలో, దేశంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉన్న మాట వాస్తవం. ఆక్సిజన్ సిలిండర్ల కొరత వల్ల కొన్ని ఆసుపత్రులు కరోనా బాధితులని అడ్మిట్ చేసుకోని ఘటనలు ఇటివల చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఇటీవల, నాసిక్ లోని ఒక ఆసుపత్రిలో ఆక్సిజన్ టాంకర్ లీక్ కావడం వల్ల, ఆక్సిజన్ అందాకా 20కి పైగా పేషెంట్లు కూడా మరణించారు. కానీ, పోస్టులో షేర్ చేసిన ఫోటోలు భారత దేశానికి సంబంధించింది కాదు.

చివరగా, సంబంధం లేని ఫోటోలని దేశంలోని కోవిడ్ పరిస్థితులకు ముడిపెడ్తున్నారు. ఒక ఫోటో బాంగ్లాదేశ్ కి సంబందించినది కాగా, మరొకటి 2018లోని ఘటనది.

Share.

About Author

Comments are closed.

scroll