Fake News, Telugu
 

ఈ ఫోటోలో ప్రధాని నరేంద్ర మోదీ పాదాభివందనం చేస్తున్న మహిళ ఐఏఎస్ అధికారి ఆర్తి డోగ్రా కాదు

0

ఉత్తరప్రదేశ్ శ్రీ కాశీ విశ్వనాధ్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దివ్యాంగురాలైన ఐఏఎస్ అధికారి ఆర్తి డోగ్రా కాళ్ళకు పాదాభివందనం చేస్తున్న దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. శ్రీ కాశీ విశ్వనాధ్ కారిడార్ పునర్నిర్మాణ పనులకు చీఫ్ ఆర్కిటెక్ట్ భాధ్యతలు నిర్వహించిన ఆర్తి డోగ్రా పాదాలకు నరేంద్ర మోదీ నమస్కరిస్తున్న దృశ్యాలని మరికొందరు ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ శ్రీ కాశీ విశ్వనాధ్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దివ్యాంగురాలైన ఐఏఎస్ అధికారి ఆర్తి డోగ్రా కాళ్ళకు పాదాభివందనం చేస్తున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో ప్రధాని నరేంద్ర మోదీ, శిఖా అనే ఒక దివ్యాంగురాలి పాదాలకు నమస్కరిస్తున్నారు. శ్రీ కాశీ విశ్వనాధ్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నరేంద్ర మోదీకి నమస్కరించడానికి వెళ్ళిన శిఖా అనే దివ్యాంగురాలిని నరేంద్ర మోదీ తిరిగి పాదాభివందనం చేసారు. 2006 సంవత్సరంలో యుపిఎస్‌సి క్లియర్ చేసి ఆర్తి డోగ్రా, ప్రస్తుతం రాజస్తాన్ ప్రభుత్వం CMO ఆఫీసులో స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆర్తి డోగ్రాకు శ్రీ కాశీ విశ్వనాధ్ కారిడార్ పునర్నిర్మాణ పనులలో ఎటువంటి ప్రమేయం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో చేసిన ఫోటోకి సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Zee News’ ఛానల్ 16 డిసెంబర్ 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. శ్రీ కాశీ విశ్వనాధ్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, శిఖా అనే ఒక దివ్యాంగురాలి పాదాలకు నమస్కరించినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. శ్రీ కాశీ విశ్వనాధ్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నరేంద్ర మోదీ పాదాలకు నమస్కరించడానికి వెళ్ళిన శిఖా అనే ఈ మహిళకు నరేంద్ర మోదీ తిరిగి పాదాభివందనం చేసినట్టు ఆర్టికల్‌లో తెలిపారు. స్త్రీలు, దివ్యాంగులపై నరేందర్ మోదీకి ఉన్న గౌరవానికి ఈ చర్య ప్రతీక అని పలు బీజేపి నాయకులు ఈ ఫోటోని తమ సోషల్ మీడియా పేజీలలో షేర్ చేసారు.

ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. నరేంద్ర మోదీ పాదాభివందనం చేసిన శిఖా అనే మహిళని ‘న్యూస్ 18’ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. శిఖా మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ అలాగే, యోగి ఆదిత్యనాథ్ తనని ఆప్యాయంగా పలకరించారని తెలిపింది. వికలాంగుల అభ్యున్నతి మీద నరేంద్ర మోదీ, యోగి అదిత్యనాథ్ ప్రభుత్వానికి ఉన్న దృష్టి మరే ప్రభుత్వానికి లేదని శిఖా ఈ సందర్భంగా మీడియాకి తెలిపింది.

ఉత్తరాఖండ్ డెహ్రాడున్‌కు చెందిన ఆర్తి డోగ్రా 2006 సంవత్సరంలో యుపిఎస్‌సి క్లియర్ చేసి ఐఏఎస్ క్యాడర్ పదవిలో నియమితులైనట్టు తెలిసింది. కేవలం మూడు అడుగులు మూడు అంగుళాల పొడవు గల ఆర్తి డోగ్రా ప్రస్తుతం రాజస్తాన్ ప్రభుత్వం CMO ఆఫీసులో స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. శ్రీ కాశీ విశ్వనాధ్ కారిడార్ పునర్నిర్మాణ పనులకు చీఫ్ ఆర్కిటెక్ట్ బాధ్యతలు నిర్వహించింది భిమాల్ పటేల్, ఆర్తి డోగ్రా కాదు. శ్రీ కాశీ విశ్వనాధ్ కారిడార్ పునర్నిర్మాణ పనులలో ఆర్తి డోగ్రా ప్రమేయం లేదు. ఐఏఎస్ అధికారి ఆర్తి డోగ్రా ఫోటోని పోస్టులో కనిపిస్తున్న మహిళ ఫోటోలని పోల్చి చూడగా, పోస్టులో షేర్ చేసిన ఫోటోలో నరేంద్ర మోదీ పాదాభివందనం చేస్తున్నది ఐఏఎస్ అధికారి ఆర్తి డోగ్రాకు కాదని స్పష్టమయ్యింది.

చివరగా, ఈ ఫోటోలో ప్రధాని నరేంద్ర మోదీ పాదాభివందనం చేస్తున్న మహిళ ఐఏఎస్ అధికారి ఆర్తి డోగ్రా కాదు.

Share.

About Author

Comments are closed.

scroll