Fake News, Telugu
 

సంబంధంలేని పాత వీడియోని రోడ్డుపై నమాజ్ చేయడాన్ని అడ్డుకున్నందుకు రాజా సింగ్‌ని అరెస్ట్ చేసినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఇటీవల దేశంలోని పలు ప్రాంతాలలో, ముఖ్యంగా హర్యానాలోని గురుగ్రామ్‌లో ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు (నమాజ్) చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అంబర్‌పేట్ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై మూడు రోజుల నుండి ముస్లిములు నమాజ్ చేయడాన్ని అడ్డుకున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ని పోలీసులు అరెస్ట్ చేసారంటూ, రాజా సింగ్‌ పోలీసులతో గొడవ పడుతున్న  వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: అంబర్‌పేట్‌లో రోడ్డుపై నమాజ్ చేయడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ని గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ దృశ్యాలు 2019లో అంబర్‌పేట్‌లో ఒక స్థలంలో మసీదు నిర్మాణానికి సంబంధించి రెండు వర్గాల మధ్య గొడవ జరిగిన సందర్భానికి సంబంధించినవి. ఈ గొడవలో పోలీసులు రాజా సింగ్‌ని అరెస్ట్ చేసి వెంటనే విడుదల చేసారు. ఈ దృశ్యాలకి రోడ్డుపై నమాజ్ చేయడానికి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియో 2019లో జరిగిన ఘటనకి సంబంధించింది. యూట్యూబ్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలను 2019లో రిపోర్ట్ చేసిన పలు కథనాలు మాకు లభించాయి. ఈ వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ రిపోర్ట్‌లో పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అంబర్‌పేట్‌లో ఒక స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగిందని, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్టు చెప్పడం చూడొచ్చు. దీన్నిబట్టి,  వైరల్ దృశ్యాలకు రోడ్డుపై నమాజ్ చేయడానికి ఎటువంటి సంబంధంలేదని తెలుస్తుంది. పైగా అంబర్‌పేట్‌లో ముస్లిములు రోడ్డుపై నమాజ్ చేసినట్టు ఎటువంటి వార్తా కథనాలు కూడా మాకు లభించలేదు.

యూట్యూబ్‌ వీడియోల ఆధారంగా గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా, ఈ ఘటనకి సంబంధించిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం అంబర్‌పేట్‌లో ఒక స్థలంలో మసీదు నిర్మాణ విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది, ఈ గొడవలో భాగంగానే పోలీసులు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ని అరెస్ట్ చేసి తరువాత విడుదల చేసారు. ఈ ఘటనకి సంబంధించిన మరొక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.

చివరగా, సంబంధంలేని పాత వీడియోని రోడ్డుపై నమాజ్ చేయడాన్ని అడ్డుకున్నందుకు రాజా సింగ్‌ని అరెస్ట్ చేసినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll