Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోని జగిత్యాల రాయపట్నం బ్రిడ్జి దగ్గర భారీ వరద ఉధృతి దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

జగిత్యాల జిల్లా రాయపట్నం బ్రిడ్జి దగ్గర భారీ వరద ఉధృతి దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. భారీ అలలు ఒక బ్రిడ్జిని చుట్టుముట్టిన దృశ్యాలని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: జగిత్యాల జిల్లా రాయపట్నం బ్రిడ్జి దగ్గర వరద ఉధృతి దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): 2017లో లక్షద్వీప్‌ మినికాయ్ ద్విపంలోని ఒక సముద్ర వంతెనను భారీ అలలు తాకుతున్న  దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Dweepdiary Lakshadweep’ అనే మీడియా సంస్థ 26 ఆగష్టు 2017 నాడు తమ యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. లక్షద్వీప్‌లోని మినికాయ్ ద్విపంలో భారీ అలలు ఈస్టర్న జెట్టి బ్రిడ్జిని ఢీకొన్న దృశ్యాలని ఈ వీడియోలో రిపోర్ట్ చేసారు. ఈ ఘటన 23 ఆగష్టు 2017 నాడు చోటుచేసుకున్నట్టు ఈ మీడియా సంస్థ రిపోర్ట్ చేసింది. ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని మరొక యూట్యూబ్ ఛానల్ 24 ఆగష్టు 2017 నాడు ఇదే వివరణతో పబ్లిష్ చేసింది.

ఈ వీడియోకి సంబంధించిన మరింత స్పష్టత కోసం ‘ఇండియా టుడే’ ఫాక్ట్-చెకింగ్ టీమ్   ‘Dweepidary Lakshadweep’ న్యూస్ పోర్టల్ చీఫ్ ఎడిటర్ బాహిర్‌ను సంప్రదించింది. బాహిర్‌ ‘ఇండియా టుడే’తో మాట్లాడుతూ, “ఈ వీడియోని లక్షద్వీప్‌లోని దక్షిణ దీవులలోని ఒకటైన మినీకాయ్ ద్విపంలో తీసారు. ఇలాంటి అలలు ఇక్కడ కొత్తవేమీ కాదు. ప్రతికూల వాతావరణం కారణంగా ఒక రోజు భారీ అలలు అరేబియా సముద్ర తీర ప్రాంతమైన తూర్పు ప్యాసింజర్ జెట్టీని చుట్టుముట్టాయి. ఈ వీడియోని తీసే క్రమంలో ఒక స్థానికుడికి స్వల్ప గాయాలయ్యాయి”, అని తెలిపారు. లక్షద్వీప్‌ మినికాయ్ ద్విపంలోని ఈస్టర్న్ జెట్టి బ్రిడ్జి యొక్క చిత్రాలని ఇక్కడ  చూడవచ్చు.

తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, రాష్ట్రంలోని డ్యామ్లు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు, జిల్లాలోని పలు చోట్ల  చెరువులకు గండి పడినట్టు, వరద నీరు వంతెనల పైనుండి ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు రాయపట్నం గోదావరి బ్రిడ్జికు భారీ వరద నీరు చేరుకున్నట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. రాయపట్నం గోదావరి బ్రిడ్జి దగ్గర వరద ఉధృతి  దృశ్యాలను చూపిస్తూ  ఒక యూట్యూబ్ యూసర్ 13 జులై 2022 నాడు తన ఛానెల్లో ఒక వీడియోని పబ్లిష్ చేసారు. 

చివరగా, సంబంధం లేని పాత వీడియోని జగిత్యాల జిల్లా రాయపట్నం బ్రిడ్జి దగ్గర వరద ఉధృతి దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll