Fake News, Telugu
 

పాకిస్థాన్‌కు చెందిన పాత వీడియోను జగిత్యాల వరదలలో కొట్టుకుపోయిన జర్నలిస్ట్ వీడియో అంటూ షేర్ చేస్తున్నారు

0

తెలంగాణలో తీవ్రమైన వరదల నేపథ్యంలో, ఒక జీపు వరద నీటిలో కొట్టుకుపోతున్న వీడియో ఫేస్‌బుక్‌ పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా ప్రచారమవుతోంది. ఈ వీడియో తెలంగాణలోని జగిత్యాలలో వరద నీటిలో కొట్టుకుపోయిన జర్నలిస్ట్‌కు సంబంధించినది అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు  చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణలోని జగిత్యాలలో NTV న్యూస్ రిపోర్టర్ కారుతో పాటు కొట్టుకుపోయిన ఘటనకు సంబంధించిన వీడియో.

ఫాక్ట్ (నిజం): తెలుగు న్యూస్ ఛానల్ NTV లో రిపోర్టర్ గా పనిచేస్తున్న జమీర్ ఓ వార్తను కవర్ చేయడానికి బోర్నపల్లి గ్రామానికి వెళ్లాడు. 12 జూలై 2022 సాయంత్రం తన స్నేహితుడితో కలిసి ‘Swift Dzire’ కారు లో తిరిగి వస్తుండగా రామాజీపేట, భూపతిపూర్ మధ్యలో ఉన్న వాగు ఉప్పొంగడంతో జమీర్ కారుతో సహా కొట్టుకుపోయాడు. అయితే, పోస్టులో షేర్ చేసిన వీడియో 2020 నాటిది. ఇప్పటి ఘటనకు సంబందించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో ఉన్న క్లెయిం గురించి సంబంధిత కీవర్డ్ లతో ఇంటర్నెట్లో వెతకగా అనేక వార్తా కథనాలు దొరికాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఇదే ఘటనకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడవచ్చు. పై కథనాల ప్రకారం, జమీర్ NTV తెలుగు న్యూస్ ఛానల్ లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. 12 జూలై 2022న బోర్నపల్లి గ్రామంలో, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గోదావరి వరద నీటిలో చిక్కుకున్న తొమ్మిది మంది కార్మికులను కాపాడుతున్న వార్తను కవర్ చేయడానికి ఆయన వెళ్లారు. తన స్నేహితుడితో కలిసి జగిత్యాలకు తిరిగి వస్తుండగా వీరిద్దరూ ప్రయాణిస్తున్న కారు వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. జమీర్ కొట్టుకుపోగా, అతని స్నేహితుడు తృటిలో తప్పించుకున్నాడు. జమీర్ ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అయితే, ఇలాంటి పోస్టునే ట్విటర్ లో ఒక వీడియోతో పాటు షేర్ చేసారు. దాని కింద ఒక వ్యక్తి ఇది పాత వీడియో అంటూ ఒక యూట్యూబ్ లింకును షేర్ చేశారు. లింకులో ఉన్న వీడియో మరియు పోస్టులో ఉన్న వీడియో రెండూ ఒకటే. యూట్యూబ్‌లో ఈ వీడియో 07 సెప్టెంబర్ 2020న అప్లోడ్ చేయబడింది. తదుపరి దర్యాప్తులో,  23 మార్చి 2020న పోస్ట్ చేసిన వీడియోను కనుగొన్నాము. ఇంకో వీడియోలో “బలూచిస్తాన్ గ్రామంలో సుజుకీ పోటోహర్ జీపు వరదలు” అనే పేరుతో మరో వీడియో కూడా ఇవే దృశ్యాలను చూపిస్తుంది.

ఈ సమాచారంతో, “సుజుకి పోటోహార్ జీప్” అని వెతకగా సుజుకి పోటోహార్ జీప్ చిత్రాలు వీడియోలో ఉన్న జీప్‌తో సరిపోలాయి. అయితే, వార్తా కథానాల ప్రకారం, జమీర్ ప్రయాణిస్తున్న కారు ‘Swift Dzire’ అని తెలుస్తుంది. కాబట్టి, ఈ వీడియో, జమీర్ ఘటనకు సంబంధించినది కాదు అని స్పష్టం అవుతుంది.

ఈ వికీపీడియా కథనం ప్రకారం, పాకిస్తాన్ సుజుకి మోటార్స్ సుజుకి పోటోహర్ జీపును తయారు చేసింది. దీన్ని బట్టి, ఈ జీప్ పాకిస్థాన్ కు చెందినదని స్పష్టమవుతోంది. అలాగే, కారులోని నంబర్ ప్లేట్ లో “BE 9119” (పసుపు ప్లేట్ పై నలుపు అక్షరాలు, సంఖ్యలు) అని ఉంది. ఇది భారత దేశంలోని నెంబర్ ప్లేట్ క్రమానికి సరిపోలేదు. ఈ వికీపీడియా వ్యాసం పాకిస్థాన్ లో వివిధ వాహనాలకు ఉపయోగించే నంబర్ ప్లేట్ల యొక్క వివిధ ఫార్మాట్లను వివరిస్తుంది. అలాగే, సింధ్ ప్రాంతం రిజిస్టర్ అయిన వాహనాల నంబర్ ప్లేట్లను ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కనుగొనడానికి ప్రయత్నించాం.

సింధ్ లో ప్రైవేట్ నాలుగు చక్రాల వాహనాలకు నెంబరు ప్లేట్ లు రెండు విధాలుగా ఉంటాయి.

  1. ” ABC 123 “
  2. “AB 1234”

వైరల్ వీడియోలో జీప్ యొక్క ఫార్మాట్ రెండవ కేటగిరీ కిందకు వస్తుంది. కానీ, సంఘటన యొక్క ఖచ్చితమైన ప్రదేశం మరియు తేదీని మేము గుర్తించలేకపోయాము. పైన ఉన్న ఆధారాల ప్రకారం, ఈ వీడియో కచ్చితంగా పాకిస్థాన్ మరియు పరిసర ప్రాంతాలకు చెందినదిగా అంచనా వేయవచ్చు.  

చివరిగా, పాకిస్థాన్‌కు చెందిన పాత వీడియో తెలంగాణలోని జగిత్యాలలో వరద నీటిలో కొట్టుకుపోయిన జర్నలిస్ట్ వీడియో అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll