Fake News, Telugu
 

‘‘హుజూరాబాద్‌లో బీజేపీ గెలవగానే అక్కడి ముస్లింలను మా చెప్పుల కింద తొక్కిపెడతాం’’ అని బీజేపీ ఎంపీ అర్వింద్ అనలేదు

0

‘‘హుజూరాబాద్‌లో బీజేపీ గెలవగానే అక్కడి ముస్లింలను మా చెప్పుల కింద తొక్కిపెడతాం’’ అని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఆ వార్త ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైనట్లుగా పోస్ట్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘‘హుజూరాబాద్‌లో బీజేపీ గెలవగానే అక్కడి ముస్లింలను మా చెప్పుల కింద తొక్కిపెడతాం’’ అని అన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.

ఫాక్ట్: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఆ వార్త ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైందనే వాదనలో నిజం లేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఒక తప్పుడు వార్తను సృష్టించారని ఆంధ్రజ్యోతి పత్రిక వారు తెలిపారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.          

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒక వేళ నిజంగా అలాంటి ప్రకటన చేసివుంటే, అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఈ విషయాన్నీ రిపోర్ట్ చేసేవి. కానీ, ఈ విషయాన్ని ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేసినట్టు మాకు ఆధారాలు దొరకలేదు.

ఆ వార్తా పత్రిక క్లిప్పింగ్ లో అక్టోబర్ 21 (ఆంధ్రజ్యోతి) అని ఉండటంతో, ఆంధ్రజ్యోతి యొక్క 21 మరియు 22వ తేదీ ఈ-పేపర్లు వెతకగా, అందులో ఈ వార్త ప్రచురితమైనట్లు లేదు.

24 అక్టోబర్ 2021న ఈ-పేపర్లో ప్రచురించిన “ఆంధ్రజ్యోతి పేరిట ఫేక్ న్యూస్” అనే టైటిల్‌తో ఉన్న ఆర్టికల్‌లో ఈ వైరల్ పోస్ట్ (వార్త) గురించి ప్రస్తావించారు. ‘హుజూరాబాద్‌లో బీజేపీ గెలవగానే అక్కడి ముస్లింలను మా చెప్పుల కింద తొక్కిపెడతాం’ అని హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నట్లుగా గుర్తుతెలియని వ్యక్తులు ఒక తప్పుడు వార్తను సృష్టించారు.” కరీంనగర్ టూటౌన్ లో కేసు నమోదు చేసినట్టు ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.

 బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ వార్త ఫేక్ న్యూస్ అని, ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ఆర్టికల్ స్క్రీన్‌షాట్ తో పోస్ట్ చేసారు.

ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ కూడా మీడియాకి తెలిపారు.

చివరగా, ‘‘హుజూరాబాద్‌లో బీజేపీ గెలవగానే అక్కడి ముస్లింలను మా చెప్పుల కింద తొక్కిపెడతాం’’ అని బీజేపీ ఎంపీ అర్వింద్ అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll