Fake News, Telugu
 

ఈ వీడియోలో లవ్ జిహాద్ గురించి మాట్లాడుతున్న కాజల్ శింగల గుజరాత్ IPS ఆఫీసర్ కాదు

0

లవ్ జిహాద్‌ గురించి సత్యాలను వివరిస్తున్న గుజరాత్ IPS ఆఫీసర్ అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. హిందూ అమ్మాయిలు తమ మతాన్ని మరియు సాంప్రదాయాలని కాపాడుకోవాలని, హిందూ అమ్మాయిలను వలలో దించడానికి ఒక్కో ముస్లిం యువకుడికి 50 వేల రూపాయలతో పాటు, బైక్ మీద తీగేందుకు కావలిసిన పెట్రోల్‌ను కూడా మదర్సాలు అందిస్తున్నాయని ఈ వీడియోలోని మహిళ తెలుపుతుంది. 18 సంవత్సరాలు దాటిన తరువాత ఆ హిందూ అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లిచేసుకుంటారు, పెళ్లి అయ్యాక ఆ హిందూ అమ్మాయి జాతిని బట్టి వారికి 6 నుండి 8 లక్షల రూపాయిల వరకు మదర్సాలు ఇస్తాయని, ఆ తరువాత ఆ హిందూ అమ్మాయితో పిల్లలను కని చివరకు వారిని వదిలేస్తున్నారని ఈ వీడియోలో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: లవ్ జిహాద్‌ గురించి సత్యాలను తెలుపుతు గుజరాత్ IPS ఆఫీసర్ పబ్లిష్ చేసిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో మాట్లాడుతున్నది గుజరాత్ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త మరియు పారిశ్రామిక వేత్తగా చెప్పుకునే కాజల్ శింగాల, ఈ వీడియోని 2021 జూన్ నెలలో తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసింది. కాజల్ శింగాల పోస్టులో తెలుపుతున్నట్టు IPS ఆఫీసర్ కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక ఫేస్‌బుక్ యూసర్ 2021 జులై నెలలో షేర్ చేసినట్టు తెలిసింది. లవ్ జిహాద్‌ గురించి కాజల్ హిందుస్థానీ చేసిన వ్యాఖ్యలంటూ ఈ వీడియోని షేర్ చేశారు.

ఈ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఇదే వీడియో కాజల్ శింగాల తన అధికారిక ఇంస్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ పేజీలలో 24 జూన్ 2021 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. జిహాదీల ద్వారా ప్రేమ ప్రచారం ఎలా జరుగుతొందనే విషయంపై కాజల్ శింగాల ఈ వీడియోలో మాట్లాడింది. కాజల్ శింగల తన సోషల్ మీడియా అకౌంట్లలో తను ఒక సామాజిక కార్యకర్త, నేషనలిస్ట్ మరియు పారిశ్రామిక వేత్తనని వివరించింది.

కాజల్ శింగాల అలియాస్ కాజల్ హిందుస్థానీ ఒక హిందూ రైట్ వింగ్ కార్యకర్త అని, ఆమె ఇదివరకు కూడా మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కాజల్ త్రివేది, గుజరాత్‌కు చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకొని తన భర్త ఇంటి పేరు వచ్చేలా కాజల్ శింగల అని పేరు మార్చుకున్నారని ‘Times Now’ వార్తా సంస్థ తమ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది.

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లా ఉనా పట్టణంలో శ్రీరామ నవమి రోజున నిర్వహించిన ఒక కార్యక్రమంలో కాజల్ హిందూస్థానీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వలన అక్కడ మత ఘర్షణలు చోటుచేసుకున్నాయని ఆమెపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో కాజల్ శింగల అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకి వచ్చారు. పోస్టులో  తెలుపుతున్నట్టు కాజల్ శింగల గుజరాత్ IPS ఆఫీసర్ కాదు.

చివరగా, ఈ వీడియోలో లవ్ జిహాద్ గురించి మాట్లాడుతున్న కాజల్ శింగల గుజరాత్ IPS ఆఫీసర్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll