Fake News, Telugu
 

జర్నలిస్టులు కానీ లేక వార్తా సంస్థలు కానీ ప్రధాని మోదీని పొగుడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు

0

టైమ్ మ్యాగజైన్‌కి చెందిన కెన్నడీ రిచర్డ్స్ మోదీని ఉద్దేశించి ‘మోదీ లాంటి వారు వేల సంవత్సరాలలో ఒక్కరు పుడుతుంటారు, మోదీ యుగంలో పుట్టినందుకు నేను అదృష్టవంతుడిని’ అని వ్యాఖ్యానించినట్టు చెప్తున్న సోషల్ మీడియా పోస్ట్ ఒకటి విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్:మోదీ లాంటి వారు వేల సంవత్సరాలలో ఒక్కరు పుడుతుంటారు, మోదీ యుగంలో పుట్టినందుకు నేను అదృష్టవంతుడిని’ –  కెన్నడీ రిచర్డ్స్, టైమ్ మ్యాగజైన్‌.

ఫాక్ట్ (నిజం): టైమ్ వెబ్సైటులో కెన్నడీ రిచర్డ్స్ పేరుతో ఎటువంటి జర్నలిస్ట్ వివరాలు లేవు.  ప్రధాని మోదీని ఉద్దేశించి ఎవరైనా జర్నలిస్ట్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు కూడా ఎటువంటి సమాచారం లేదు. ఇటీవల టైమ్ మ్యాగజైన్‌ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో మోదీని ఉద్దేశించి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

టైమ్ వెబ్సైటులో ఎడిటర్స్, రిపోర్టర్స్, ఫోటోగ్రాఫర్స్ మొదలైన సిబ్బందికి సంబంధించిన వివరాలలో కెన్నడీ రిచర్డ్స్ పేరుతో ఎటువంటి జర్నలిస్ట్ వివరాలు లేవు. గూగుల్‌లో వెతికినప్పుడు కూడా కెన్నడీ రిచర్డ్స్ పేరుతో టైమ్ మ్యాగజైన్‌లో గాని లేక ఇతర వార్తా సంస్థలో జర్నలిస్టు ఉన్నట్టు ఎటువంటి సమాచారం లభించలేదు.

పైగా టైమ్ మ్యాగజైన్‌గాని లేక ఇతర వార్తా సంస్థలుగాని మోదీని ఉద్దేశించి పోస్టులో చెప్పిన వ్యాఖ్యలు చేసినట్టు కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే మోదీని ఉద్దేశించి ఎవరైనా ప్రముఖులు అలాంటి వ్యాఖ్యలు చేసివుంటే, దేశంలోని అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఈ విషయాన్నీ రిపోర్ట్ చేసేవి. కానీ, ఈ విషయాన్ని ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేసినట్టు మాకు ఆధారాలు దొరకలేదు.

గత నెలలో టైమ్ మ్యాగజైన్‌ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులు, 2021 జాబితాలో మోదీ కూడా చోటు సాధించాడు. ఐతే ‘నరేంద్ర మోదీ భారతదేశాన్ని లౌకికవాదానికి దూరంగా హిందూ జాతీయవాదం వైపు నెట్టారు’, ‘మోదీ ప్రభుత్వం ముస్లింల హక్కులను హరించింది, ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపే జర్నలిస్టులను జైలులో పెడుతుంది’ అంటూ ఈ లిస్టులో మోదీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

గతంలో కూడా నాలుగు సార్లు మోదీపై భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులు జాబితాలో చోటు కల్పించింది. ఐతే టైమ్ మ్యాగజైన్‌ గతంలో ఎప్పుడు కూడా మోదీని ఉద్దేశించి పోస్టులో చెప్పిన వ్యాఖ్యలు మాత్రం చేయలేదు.

చివరగా, జర్నలిస్టులు కానీ లేక వార్తా సంస్థలు కానీ మోదీని పొగుడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll