Fake News, Telugu
 

నిర్మల్ బహిరంగ సభలో జాతీయ గీతం పాడుతున్నప్పుడు బీజేపీ నాయకులు అరవింద్, జితేందర్ రెడ్డి జాతీయ జెండాకు సెల్యూట్ చేసారు

0

‘దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకునే తెలంగాణ బీజేపీ నాయకులు, నిర్మల్ బహిరంగ సభలో జాతీయ గీతం పాడుతున్నప్పుడు సెల్యూట్ చేయకుండా నిలిచున్నారు’, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ‘నమస్తే తెలంగాణ’ వార్త పత్రిక ప్రచురించిన ఒక కథనం యొక్క ఫోటోని ఈ పోస్టులో షేర్ చేసారు. 17 సెప్టెంబర్ 2021 నాడు బీజేపీ నిర్వహించిన ‘తెలంగాణ వియోచన దినోత్సవం’ సభలో, బీజేపీ నాయకులు ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డి, జాతీయ గీతం పాడుతున్న సమయంలో జాతీయ జెండాకి సెల్యూట్ చేయకుండా నిలుచున్నారని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: నిర్మల్ బహిరంగ సభలో నిజామాబాద్ ఎంపీ అరవింద్, బీజేపీ నేత జితేందర్ రెడ్డిలు జాతీయ జెండాకు సెల్యూట్ చేయకుండా నిలిచున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): నిర్మల్ బహిరంగ సభలో జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు బీజేపీ నేతలు ధర్మపురి అరవింద్,  జితేందర్ రెడ్డిలు నిలబడి జాతీయ జెండాకు సెల్యూట్ చేసారు. అమిత్ షా ముఖ్య అతిధిగా విచ్చేసిన ‘తెలంగాణ వియోచన దినోత్సవం’ సభలో బీజేపీ నాయకులు జాతీయ జెండాను అవమానించినట్టు మరే ఒక న్యూస్ సంస్థ రిపోర్ట్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించి స్పష్టత కోసం నిర్మల్ బహిరంగ సభ విడియోలను వెతికితే, నిర్మల్ బహిరంగ సభలో బీజేపీ నాయకుడు అమిత్ షా జెండా ఎగరవేసిన దృశ్యాలని చూపుతూ ‘V6’ న్యూస్ సంస్థ 17 సెప్టెంబర్ 2021 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియోని పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ‘తెలంగాణ వియోచన దినోత్సవం’ సభా వేదికపై ఉన్న ప్రముఖ బీజేపీ నాయకులు, జాతీయ గీతం వచ్చినప్పుడు జాతీయ జెండాకు లేచి సెల్యూట్ చేసిన దృశ్యాలని ఈ వీడియోలో చూడవచ్చు.  కానీ, ఈ వీడియోలో తెలంగాణ బీజేపీ నాయకులు ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డిలు కనబడలేదు. ఈ సభకు హజారైన బీజేపీ కార్యకర్తలు కొందరు, అమిత్ షా జాతీయ జెండా ఎగరవేసిన సమయంలో వీడియోలు తీసి తమ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసారు. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. బీజేపీ కార్యకర్తలు షేర్ చేసిన ఈ లైవ్ వీడియోలలో, బీజేపీ నాయకులు ధర్మపురి అరవింద్ మరియు జితేందర్ రెడ్డి, జాతీయ గీతం పాడుతున్న సమయంలో నిలబడి జాతీయ జెండాకు సెల్యూట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

నిర్మల్ సభలో జాతీయ జెండాకు సెల్యూట్ చేసిన ఫోటోని నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసారు.

అయితే, బీజేపీ కార్యకర్తలు షేర్ చేసిన ఒక వీడియోలో, జాతీయ గీతం ముగిసిన తరువాత కొందరు బీజేపీ నేతలు త్వరగా, మరికొందరు నాయకులు ఆలస్యంగా చేతులు దింపుతున్న విషయాన్ని మనం చూడవచ్చు. ఈ వీడియోలో జాతీయ గీతం ముగిసిన తరువాత ఈటల రాజేందర్, రాజా సింగ్ త్వరగా చేతులు కిందకి దింపితే, వారి పక్కన ఉన్న నాయకులు ఇంకా సెల్యూట్ చేస్తూనే ఉండటాన్ని మనం గమనించవచ్చు. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ప్రచురించిన ఫోటో కూడా సభలో జాతీయ గీతం పాడటం ముగిసిన తరువాత తీసి ఉండవచ్చని ఈ వివరాల ఆధారంగా చెప్పవచ్చు. 17 సెప్టెంబర్ 2021 నాడు బీజేపీ నిర్వహించిన తెలంగాణ వియోచన దినోత్సవ సభలో, బీజేపీ నాయకులు జాతీయ జెండాను అవమానించినట్టు మరే వార్తా సంస్థ రిపోర్ట్ పబ్లిష్ చేయలేదు. పోస్టులో షేర్ చేసిన ఫోటో ఈ సభలో ఎప్పుడు తీసిందో చెప్పలేనప్పటికీ, నిర్మల్ సభలో జాతీయ గీతం పాడుతున్న సమయంలో ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డి నిలబడి జాతీయ జెండాకు సెల్యూట్ చేసినట్టు ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇదివరకు, 75వ స్వాత్రంత్య దినోత్సవ వేడుకలలో తెలంగాణ హోం మంత్రీ ముహమ్మద్ అలీ, నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జాతీయ జెండాకు సెల్యూట్ చేయలేదని ఇలానే పోస్టులు షేర్ చేసినప్పుడు, FACTLY ఆ క్లెయిమ్ తప్పని రుజువు చేస్తూ ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరకు, నిర్మల్ బహిరంగ సభలో జాతీయ గీతం పాడుతున్న సమయంలో బీజేపీ నాయకులు ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డి జాతీయ జెండాకు సెల్యూట్ చేసారు.

Share.

About Author

Comments are closed.

scroll