Fake News, Telugu
 

2018 వీడియోని ఇటీవల జరిగిన మునుగోడు సభకు TRS పార్టీ కార్యకర్తలకు మద్యం పంపిణీ చేసిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

మునుగోడులో సభ సంధర్భంగా TRS పార్టీ తమ కార్యకర్తలకు బస్సులో మద్యం పంపిణీ చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ప్రయాణిస్తున్న బస్సులో TRS కార్యకర్తలు మద్యం సేవిస్తున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. మనుగోడు ఉప ఎన్నికల సందర్భంగా అన్నీ పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టిన నేపథ్యంలో, ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.      

క్లెయిమ్: మునుగోడు సభకు తీసుకెళ్తూ TRS పార్టీ తమ కార్యకర్తలకు బస్సులోనే మద్యం పంపిణీ చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. 2018 సెప్టెంబర్ నెలలో TRS పార్టీ నిర్వహించిన  ప్రగతి నివేదన సభకు వెళ్తుండగా కార్యకర్తలు బస్సులో మద్యం సేవించిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోకి మనుగోడులో జరుగనున్న ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది. 

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలను పోలి ఉన్న వీడియోని ఒక యూట్యూబ్ ఛానల్ 03 సెప్టెంబర్ 2018 నాడు పబ్లిష్ చేసినట్లు తెలిసింది. ప్రగతి నివేదన సభకు వెళ్తుండగా TRS పార్టీ కార్యకర్తలు బస్సులోనే మద్యం సేవిస్తున్న దృశ్యాలంటూ ఈ వీడయో వివరణలో తెలిపారు. ఈ వీడియోని ఇదే వివరణతో పలు వార్తా సంస్థలు కూడా పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పోస్టులో షేర్ చేసిన వీడియో, అసలైన వీడియోని ఫ్లిప్ చేసి పబ్లిష్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది.     

ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతూ ‘Times Now’ వార్తా సంస్థ 03 సెప్టెంబర్ 2018 నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ప్రగతి నివేదన సభకు కార్యకర్తలను ఆర్టీసీ బస్సులలో, ట్రాక్టర్లలో తరలిస్తు ప్రయాణంలో వారికి TRS పార్టీ మద్యం పంపిణీ చేస్తున్న దృశ్యాలని ఈ ఆర్టికల్‌లో తెలిపారు.

TRS పార్టీ నిర్వహించిన మరికొన్ని సభలలో కూడా కార్యకర్తలు మద్యం సేవిస్తూ డబ్బులు తీసుకుంటున్న వీడియోలు అంటూ గతంలో వైరల్ అయ్యాయి. కానీ, పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది, మనుగోడులో జరుగనున్న ఎన్నికలకు సంబంధించినది కాదు.

చివరగా, 2018 వీడియోని ఇటీవల జరిగిన మనుగోడు సభకు TRS పార్టీ కార్యకర్తలకు మద్యం పంపిణీ చేసిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll