జనాభాలో 8 శాతం దాటిన వర్గాలకు మైనారిటీ హోదా పోతుందని రాజ్యాంగంలో ఉన్నట్టు చెప్తున్న పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: రాజ్యాంగం ప్రకారం 8% దాటిన వర్గాలకు మైనారిటీ హోదా పోతుంది.
ఫాక్ట్ (నిజం): పోస్టులో చెప్పినట్టు 8% దాటిన వర్గాలకు మైనారిటీ హోదా పోతుందని రాజ్యాంగంలో లేదు. అసలు ‘మైనారిటీ’ అంటే ఎవరు అనేది రాజ్యాంగంలో నిర్వచించబడలేదు. ‘National Commission for Minorities (NCM) Act, 1992’ చట్టం ద్వారా ప్రభుత్వం వివిధ వర్గాలను మైనారిటీలుగా గుర్తిస్తారు. ఆ చట్టంలో కూడా ఎటువంటి జనాభా శాతం గురించి లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టులో చెప్పిన దాని గురించి వెతకగా, 8% దాటిన వర్గాలకు మైనారిటీ హోదా పోతుందని రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదని తెలుస్తుంది. 2013 లో రాజ్య సభలో అడిగిన ఒక ప్రశ్నకి నినోంగ్ ఎరింగ్ (అప్పటి ‘Minister of State in the Ministry of Minority Affairs’) సమాధానమిస్తూ, ‘రాజ్యాంగంలో ‘minorities’ (మైనారిటీలు) అనే పదం కొన్ని ఆర్టికల్స్ (ఆర్టికల్ 29 to 30 మరియు 350 A to 350 B) లో వాడబడింది, కానీ దానిని ఎక్కడా కూడా నిర్వచించలేదు. ‘National Commission for Minorities (NCM) Act, 1992’ చట్టం ద్వారా ప్రభుత్వం వివిధ వర్గాలను మైనారిటీలుగా గుర్తిస్తారు’ అని తెలిపాడు
ఇప్పటివరకు ముస్లింలను, క్రిస్టియన్లను, బౌద్ధులను, జైన్లను, సిక్కులను మరియు పార్సీలను మైనారిటీలుగా ప్రభుత్వం నోటిఫై చేసింది (జైన్లను 2014 లో మైనారిటీలుగా నోటిఫై చేసారు). ‘National Commission for Minorities (NCM) Act, 1992’ చట్టంలో కూడా 8% దాటిన వర్గాలకు మైనారిటీ హోదా పోతుందని లేదు
రాష్ట్ర జనాభా పరంగా ‘మైనారిటీ’ ని నిర్వచించడానికి మార్గదర్శకాలను నిర్ణయించమని 2019 లో మైనారిటీ కమిషన్‌కు సుప్రీమ్ కోర్టు చెప్పినట్టు ఇక్కడ చదవొచ్చు. రాజ్యాంగంలో మైనారిటీలకు సంబంధించి ఉన్న ఆర్టికల్స్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, 8% దాటిన వర్గాలకు మైనారిటీ హోదా పోతుందని రాజ్యాంగంలో లేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?