మోదీ సాధించిన విజయాలంటూ, మోదీ బ్రిటన్‌లో 53 దేశాల సమావేశంలో జనరల్ ప్రెసిడెంట్ అయ్యాడు; ప్రపంచంలోని 25 అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ నాల్గవ స్థానంలో ఉంది; UN మానవ హక్కుల మండలిలో భారతదేశం అత్యధిక ఓట్లు సాధించింది, 97 ఓట్లు అవసరం ఉండగా, 188 ఓట్లు వచ్చాయి, మొదలైన పలు క్లెయిమ్స్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ క్లెయిమ్స్ కి సంబంధించి నిజాలేంటో చూద్దాం.
క్లెయిమ్: మోదీ బ్రిటన్‌లో 53 దేశాల సమావేశంలో జనరల్ ప్రెసిడెంట్ అయ్యాడు; ప్రపంచంలోని 25 అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ నాల్గవ స్థానంలో ఉంది, మొదలైన పలు మోదీ సాధించిన విజయాలు.
ఫాక్ట్ (నిజం): 2018లో బ్రిటన్‌లో జరిగిన కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశానికి కామన్వెల్త్ చైర్-ఇన్-ఆఫీస్ గా అప్పటి బ్రిటన్ ప్రధాని తెరెసా మే వ్యవహారించారు, మోదీ కాదు. 2020లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి భారత్ 184 వోట్లతో ఎన్నిక కాగా, మెక్సికో 187 వోట్లతో ఎన్నికైంది. 2011-12లో భారత్ భద్రతా మండలికి ఎన్నికైన అన్ని దేశాలకన్నా ఎక్కువగా 187 వోట్లు సాధించింది. ఆసియా పవర్ ఇండెక్స్ 2020లో భారతదేశం నాల్గవ అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచింది, ఈ ఇండెక్స్ కేవలం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని కేవలం 26 దేశాలకు మాత్రమే పరిమితం. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
మోదీ బ్రిటన్‌లో 53 దేశాల సమావేశంలో జనరల్ ప్రెసిడెంట్ అయ్యాడు:
మోదీ బ్రిటన్‌లో పాల్గొన్న 53 సభ్య దేశాల సమావేశం 2018లో జరిగిన కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశం. ఈ క్లెయిమ్ లో ప్రస్తావించింది కూడా ఈ సమావేశం గురించే. ఈ సమావేశంలో మానవ హక్కులు, క్లైమేట్ చేంజ్ మొదలైన చాలా అంశాలపై చర్చలు జరిగాయి.
ఐతే ఈ సమావేశానికి కామన్వెల్త్ చైర్-ఇన్-ఆఫీస్ గా అప్పటి బ్రిటన్ ప్రధాని తెరెసా మే వ్యవహారించారు. ఈ సమావేశం ప్రెసిడెంట్ గా మోదీని ఎన్నుకోలేదు. ఈ సంవత్సరం జరగాల్సిన కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశం కరోనా కారణంగా వాయిదా పడింది.
UN భద్రతా మండలిలో భారతదేశం అత్యధిక ఓట్లు సాధించిన సభ్యదేశంగా నిలిచింది. 97 ఓట్లు అవసరం ఉండగా, 188 ఓట్లు వచ్చాయి:
జూన్ 2020లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఐదు నాన్- పెర్మనెంట్ సీట్లకు జరిగిన ఎన్నికల్లో భారత్, మెక్సికో, కెన్యా, నార్వే మరియు ఐర్లాండ్ ఎన్నికయ్యాయి. ఈ ఎన్నికల్లో పోల్ అయిన మొత్తం 192 వోట్లలో భారత్ 184 వోట్లు సాధించింది. ఐతే ఈ ఎన్నికల్లో మెక్సికో అత్యధికంగా 187 వోట్లు సాదించింది.
ఐతే గతంలో కూడా అనేక సార్లు భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఎన్నికైంది. చివరిసారిగా 2011-12లో ఎన్నిక కాగా, ఆ సమయంలో భద్రతా మండలికి ఎన్నికైన అన్ని దేశాలకన్నా ఎక్కువగా 187 వోట్లు సాధించింది.
ప్రపంచంలోని 25 అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారతదేశం నాల్గవ స్థానంలో ఉంది:
గత సంవత్సరం అక్టోబర్ లో సిడ్నీకి చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ 2020లో భారతదేశం నాల్గవ అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచింది. అమెరికా, చైనా మరియు జపాన్ ఈ లిస్టులో భారత్ కంటే ముందున్నాయి. ఐతే ఈ ఇండెక్స్ కేవలం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని కేవలం 26 దేశాలకు మాత్రమే పరిమితం, ప్రపంచంలోని అన్ని దేశాలకు కాదు.
ఈ వైరల్ పోస్టులో చేసిన మిగతా క్లెయిమ్స్ చాలా వరకు నిజమే అయినప్పటికీ గతంలోని విషయాలకు సంబంధించివి. ఉదాహారణకి భారత్ ఉక్కు ఉత్పత్తిలో జపాన్‌ను దాటి రెండో ర్యాంకు సాధించిన వార్తా 2018కి సంబంధించింది. అలాగే భారత్ చక్కర ఉత్పత్తిలో బ్రెజిల్‌ను దాటేసి మొదటి స్థానానికి చేరకోబోతుందన్న వార్త కూడా 2018కి సంబంధించింది.
చివరగా, ఈ పోస్టు ద్వారా మోదీ సాధించిన విజయాలంటూ వాస్తవాలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు.