Fake News, Telugu
 

బంగ్లాదేశ్‌లో వెస్టిజియల్ తోకతో జన్మించిన శిశువు ఫోటోలని నేపాల్ పూజారికి ‘బాల హనుమాన్’ జన్మించిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

నేపాల్‌లోని ఒక పూజారికి తోక కలిగి ఉన్న శిశువు జన్మించాడు, అంటూ సోషల్ మీడియాలో రెండు ఫోటోలతో కూడిన ఒక పోస్టు షేర్ అవుతుంది. హనుమాన్ ఆలయంలో గత 63 సంవత్సరాలుగా అర్చకం సేవ చేస్తున్న ఈ నేపాల్ పూజారి భక్తికి మెచ్చి భగవంతుడు ‘బాల హనుమాన్’ రూపంలో అతనికి జన్మించాడు అంటూ ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

క్లెయిమ్: నేపాల్‌లోని ఒక పూజారి ఇంట్లో తోక కలిగి ఉన్న శిశువు (బాల హనుమాన్) జన్మించిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న శిశువు 2019లో బంగ్లాదేశ్ నొకాలి జిల్లాలో జన్మించాడు, నేపాల్ దేశంలో కాదు. 16 సెంటిమిటర్ల తోకతో జన్మించిన ఈ శిశువుకు ఢాకా వైద్యులు శస్త్ర చికిత్స చేసి తోకని తొలగించారు. గర్భం దాల్చిన నాలుగు నుండి ఎనిమిది వారల సమయంలో ప్రతి శిశువుకి ఇలాంటి తోక పెరుగుతుందని శాస్త్రవేత్తల విశ్లేషణలో స్పష్టమయ్యింది. ‘Vestigial tail’గా పిలవబడే ఈ తోక ఎనిమిది వారల తరువాత సాధారణంగా శిశువు శరీరంలోకి తిరిగి వెళ్లి టెయిల్ బోనుగా ఏర్పడుతుందని వైద్యులు తెలిపారు. అయితే, కొన్ని అరుదైన సందర్భాలలో మాత్రమే ఈ తోక పెద్దదిగా మారి శిశువులు తోకతో జన్మిస్తారని వైద్యులు తెలిపారు. ప్రపంచంలో ఇప్పటివరకు కేవలం 40 మంది శిశువులు మాత్రమే ఇలా తోకతో జన్మించినట్టు నిర్ధారణ అయ్యింది. దీనిలో ఎటువంటి దైవ చమత్కారం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే ఫోటోలని షేర్ చేస్తూ ‘Philippine News’ సంస్థ 17 జూన్ 2019 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోలలో కనిపిస్తున్న శిశువు, బంగ్లాదేశ్ నోఖాలి జిల్లాలో జన్మించాడని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. 16 సెంటిమిటర్ల పొడవు కలిగిన తోకతో ఈ శిశువు జన్మించాడని ఆర్టికల్‌లో తెలిపారు.

బంగ్లాదేశ్ నోఖాలి జిల్లాలో తోకతో జన్మించిన ఈ శిశువుకి సంబంధించి ‘Dhaka Tribune’ వార్తా సంస్థ 13 జూన్ 2019 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఢాకా నగరంలోని భంగబందు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్సిటీ ఆసుపత్రిలో పిడియాట్రిషన్‌గా పనిచేస్తున్న నజ్రుం ఇస్లాం ఆకాశ్, ఈ శిశువుకి శస్త్ర చికిత్స చేసి తోకని తొలగించినట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. నజ్రుం ఇస్లాం ఆకాశ్ మీడియాతో మాట్లాడుతూ, “ఈ కేసు క్లిష్టమయినది ఏమి కాదు. ఈ తోక శిశువు నరాలకు, ఎముకకు అలాగే, వెన్నుపుసకు అనుసంధించబడి లేదు. మానవ తోకలు రెండు రకాలు: సూడో తోక మరియు నిజమైన తోక. ఈ శిశువుకు ఉన్నది నిజమైన తోక (ఎముకలు లేకుండా కేవలం చర్మం మాత్రమే తోకలాగ పెరిగే విధానం). ఈ తోక వల్ల శరీరానికి ఎటువంటి  ప్రమాదం ఉండదు”, అని తెలిపారు.  

గర్భం దాల్చిన నాలుగు నుండి ఎనిమిది వారల సమయంలో ప్రతి శిశువులో ఇలాంటి తోక పెరుగుతుందని వైద్య శాస్త్రవేత్తల విశ్లేషణలో స్పష్టమయ్యింది. ‘Vestigial tail’గా పిలవబడే ఈ తోక ఎనిమిది వారల తరువాత సాధారణంగా శిశువు శరీరంలోకి తిరిగి వెళ్లి టెయిల్ బోనుగా ఏర్పడుతుంది. అయితే, కొన్ని అరుదైన సందర్భాలలో మాత్రమే ఈ తోక పెద్దదిగా మారి శిశువులు తోకతో జన్మిస్తారని వైద్యులు తెలిపారు. హ్యూమన్ టెయిల్‌కు సంబంధించి NCBI మరియు ఇతర వైద్యసంస్థలు పబ్లిష్ చేసిన పరిశోధన డాక్యుమెంట్లని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. శిశువులలో పెరిగే ఈ తోక, ఎముకలు లేదా నాడి వ్యవస్థకు సంబంధం లేకుండా కేవలం చర్మంతో మాత్రమే పెరుగుతుందని వైద్యుల విశ్లేషణలో తేలింది. ప్రపంచంలో ఇప్పటివరకు కేవలం 40 మంది శిశువులు మాత్రమే ఇలా తోకతో జన్మించినట్టు నిర్ధారణ అయ్యింది. ఇటీవల, బ్రెజిల్ దేశంలో కూడా 12 సెంటిమీటర్ల పొడవు తోకతో ఒక బాలుడు జన్మించాడు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. శిశువులు తోకతో జన్మించడంలో ఎటువంటి దైవ చమత్కారం లేదు.

చివరగా, శిశువులలో అరుదుగా పెరిగే వెస్టిజియల్ తోకని దైవ చమత్కారమంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll