శౌర్య దివస్ రోజున మథురలోని హిందువులు భారీ ర్యాలీ నిర్వహించిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. మథురలో కృష్ణుడి భక్తులు పోలీసుల బారికేడ్లను దాటుకొని మరీ నిరసన తెలుపుతున్న దృశ్యాలని, మరికొందందు ఇవే దృశ్యాలతో కూడిన స్పష్టమైన వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేసారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: శౌర్య దివస్ రోజు మథురలోని హిందువులు భారీ ర్యాలీ నిర్వహించిన దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో 2021 అక్టోబర్ నెలలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్భ నగరంలో విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహించిన హిందూ హుంకర్ ర్యాలీలోని దృశ్యాలని చూపిస్తుంది. కవర్ధాలో చోటుచేసుకున్న మతఘర్షణలను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ వారు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ వీడియోలో కనిపిస్తున్న హిందూ ర్యాలీ మథురలో జరగలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలతో పోలి ఉన్న వీడియోని ఒక యూట్యూబ్ ఛానల్ 13 అక్టోబర్ 2021 నాడు షేర్ చేసినట్టు తెలిసింది. ఛత్తీస్‌గఢ్ కోర్భ నగరంలో విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహించిన హిందూ హుంకర్ ర్యాలీలోని దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. పోస్టులో కనిపిస్తున్న అవే దృశ్యాలు కలిగిన వీడియోలని పలు న్యూస్ ఛానల్స్, ఫేస్బుక్ యూసర్లు ఇదే వివరణతో షేర్ చేసారు. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
ఈ వివరాల ఆధారంగా వీడియోలో కనిపిస్తున్న ర్యాలీకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఈ ర్యాలీ యొక్క అవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘ETV Bharat’ వార్తా సంస్థ 12 అక్టోబర్ 2021 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో షేర్ చేసినట్టు తెలిసింది. ఛత్తీస్‌గఢ్ కవర్ధాలో అక్టోబర్ నెలలో చోటుచేసుకున్న మత ఘర్షణలను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ వారు ఈ ర్యాలీని నిర్వహించినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ‘The Times of Chhattisgarh’ అనే న్యూస్ సంస్థ కూడా ఆర్టికల్ పబ్లిష్ చేసింది.
అంతేకాదు, పోస్టులో షేర్ చేసిన వీడియో మథుర నగరానికి సంబంధించిందని సోషల్ మీడియాలో వైరల్ చేసినప్పుడు, ఈ వీడియో మథుర నగరానికి సంబంధించింది కాదని స్పష్టం చేస్తూ మథుర పోలీసులు ట్వీట్ కూడా చేసారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో కవర్ధా మత ఘర్షణలకు సంబంధించి నిర్వహించిన బహిరంగ ర్యాలీది అని, ఈ ర్యాలీ మథుర నగరంలో జరగలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, ఛత్తీస్‌గఢ్ కవర్ధా మతఘర్షణలకు సంబంధించిన పాత ర్యాలీ వీడియోని హిందువులు ఇటీవల మథుర నగరంలో నిర్వహించిన ర్యాలీ అంటూ షేర్ చేస్తున్నారు.