Fake News, Telugu
 

‘షికారా’ సినిమాని ఒక కాశ్మీరీ పండిట్ మహిళ విమర్శిస్తున్నప్పుడు తీసిన పాత వీడియోను ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకి ముడిపెడుతున్నారు

0

కాశ్మీర్ ఫైల్స్ సినిమా పూర్తిగా ఫేక్ అని సినిమా నడుస్తున్న థియేటర్లొ హిందూ సోదరి లేచి, ఈ సినిమాలో నిజం చూపించలేదు, ఈ సినిమా ఉద్దేశం రెండు వర్గాల్లో గందరగోళం వ్యాప్తి చేయడమే” అంటూ ఒక వీడియో మరియు రెండు ఫోటోలను, ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కాశ్మీర్ ఫైల్స్ సినిమా పూర్తిగా ఫేక్ అని, హిందూ మహిళ ఒక థియేటర్‌లో విలపిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్: ఈ వీడియో 2020లో తీసింది; ఇటీవల విడుదలైన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో దీనికి సంబంధంలేదు. విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన షికారా: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ కాశ్మీరీ పండిట్స్‘ సినిమా చూసిన తర్వాత దివ్య రాజ్దాన్ అనే మహిళ ఏడుస్తూ వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ వీడియో తీసారు. పోస్టులోని రెండు ఫోటోల్లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా ఫేక్ అని అనలేదు, సినిమాని అభినందించారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.          

ఈ వైరల్ వీడియోలోనే ‘Reaction to Vidhu Vinod Chopra’s Shikara movie which secularized massacre of Kashmiri Pandits’ అని ఉన్నట్టు చూడొచ్చు. ఈ కీ-వర్డ్స్ ఉపయోగించి, వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న వీడియో యూట్యూబ్‌లో లభించింది. ‘Viralbollywood’ యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ వీడియోను 07 ఫిబ్రవరి 2020న అప్లోడ్ చేసినట్టు చూడొచ్చు. అప్పటికి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా ఇంకా విడుదల కాలేదు. అటువంటి వీడియోలు అదే సమయంలో రిపోర్ట్ చేసినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన షికారా: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ కాశ్మీరీ పండిట్స్ సినిమా చూసిన తర్వాత దివ్య రజ్దాన్ అనే మహిళ ఏడుస్తూ వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ వీడియో తీసారు. థియేటర్‌లో ఉన్న చోప్రాపై ఆమె విరుచుకుపడ్డారు. కాశ్మీరీ పండిట్ల చిత్రణతో పూర్తిగా నిరాశ చెందిన ఆమె, “మారణహోమం చూపించలేదు. నా సమాజం మొత్తం కాలిపోయింది. మీరు రాజకీయాలు ఎందుకు ఆడారు? మీ వాణిజ్యవాదానికి (commercialism) అభినందనలు. ఒక కాశ్మీరీ పండిట్ గా నేను మీ సినిమాను తిరస్కరిస్తున్నాను” అని అన్నారు. ఆ మహిళకు సమాధానం చెప్తూ దర్శకుడు “థాంక్యూ వెరీ మచ్” అని చెప్పాడు. ఆ మహిళ కోసం చిత్రం యొక్క సీక్వెల్ తీస్తానని చోప్రా క్యాజువల్ గా బదులిచ్చాడు. ‘సత్యానికి రెండు ముఖాలుంటాయి’ అని, ఒకే సమస్యలపై ప్రజలకు భిన్నమైన దృక్పథాలు ఉంటాయని దర్శకుడు తెలిపాడు.

పోస్టులో చూపించిన రెండు ఫోటోలు ‘ది కాశ్మీర్ ఫైల్స్’కు సంబంధించిన ఫొటోలే. మొదటి ఫోటో, ఒక మహిళ, ఈ సినిమా తీసినందుకు, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కాళ్ళు పట్టుకొని అభినందనలు తెలిపిన తర్వాత తీసింది. రెండో ఫోటో, ఢిల్లీలోని ఒక థియేటర్‌లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాని చప్పట్లతో అక్కడి వారు అభినందిస్తున్నప్పుడు తీసింది. ఈ రెండు ఫోటోల్లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా ఫేక్ అని అనలేదు, సినిమాని అభినందించారు.

చివరగా, ‘షికారా’ సినిమాని ఒక కాశ్మీరీ పండిట్ మహిళ విమర్శిస్తున్నప్పుడు తీసిన పాత వీడియోను ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకి ముడిపెడుతున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll