తనకు ఇంకొక ఛాన్స్ ఇస్తే ప్రతి ఇంటికి కిలో బంగారం, బెంజ్ కార్ ఇస్తాను అని సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: తనకు మరో ఛాన్స్ ఇస్తే ప్రతీ ఇంటికి ఒక కిలో బంగారం, బెంజ్ కార్ ఇస్తాను అని అన్న సీఎం వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి.
ఫాక్ట్(నిజం): ఇటీవల గుడివాడలో జరిగిన TIDCO ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేసి ఈ వైరల్ వీడియోను తయారు చేసారు. ఈ మాటలు సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అన్నారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి ఇంటర్నెట్లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతకగా, వైరల్ వీడియోలో సీఎం జగన్ అన్న మాటలు గుడివాడలో 16 జూన్ నాడు జరిగిన TIDCO ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఇచ్చిన ప్రసంగంలోవి అని తెలిసింది.
ఈ ప్రసంగంలో చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ, ఆయన తను MLAగా ఉన్న కుప్పం నియోజకవర్గానికి వెళ్లి ‘ఇంకో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా… ఇంకో ఛాన్స్ ఇవ్వండి ఇంకా ఎక్కువ చేస్తా.. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతీ ఇంటికి కేజీ బంగారం ఇస్తా.. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతీ ఇంటికి బెంజ్ కార్ ఇస్తా. అని ఈ పెద్దమనిషి, ఈ మధ్య కాలంలో, ఎన్నికలు దెగ్గరపడే సరికే… మళ్ళీ ఈ పెద్దమనిషి మోసం చేయటానికి బయల్దేరాడు,’ అని అన్నారు.
ఈ ప్రసంగం యొక్క ఈ భాగం ఈ యూట్యూబ్ వీడియోలో మీరు చూడవచ్చు, ఈ వీడియోలో 2:47 నుండి 3:30 వరకు ఈ మాటలు జగన్ అంటారు. ప్రసంగంలోని ఈ భాగంలోనుంచి కొన్ని వాక్యాలను తొలగించి, ‘ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతీ ఇంటికి కేజీ బంగారం ఇస్తా.. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతీ ఇంటికి బెంజ్ కార్ ఇస్తా,’ అని ఈ వాగ్ధానం సీఎం జగన్ చేసినట్లు అర్థం వచ్చేలాగా వైరల్ వీడియోని ఎడిట్ చేసి, తప్పుగా షేర్ చేస్తున్నారు. గుడివాడ సభలో జగన్ చేసిన పూర్తి ప్రసంగం మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
గతంలో కూడా ఒకసారి, తన పార్టీకి ఓటు వేసే ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని వై.ఎస్. జగన్ వాగ్ధానం చేసినట్టు ఎడిట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, దానిపై ఒక ఫాక్ట్ చెక్ ఆర్టికల్ రాసాము.
చివరిగా, ఇంకో ఛాన్స్ ఇస్తే ప్రతీ ఇంటికి బంగారం, బెంజ్ కార్ ఇస్తాను అని చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటున్న వీడియోని తనకి ఆపాదిస్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు.