వైకాపా ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి, “జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో గెలవటానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏం చేసినా జగన్ ఎన్నికల్లో గెలవడు” అని తెలిపారు అంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: వైకాపా ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, “జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో గెలవటానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏం చేసినా జగన్ ఎన్నికల్లో గెలవడు” అని తెలిపారు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో 8 మార్చి 2024న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సందర్భంలోది. రామకృష్ణా రెడ్డి ఈ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు మరియు తెదేపాను విమర్శిస్తూ, “చంద్రబాబు నాయుడు ఏదో ఒక రకంగా 2024 ఎన్నికల్లో గెలిచేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. జగన్ మోహన్ రెడ్డిని ఓడించేందుకు భాగంగా, బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో పడిగాపులు కాస్తూ ఆఖరి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చంద్రబాబు బాలహీనతను, ప్రజల్లో జగన్ మోహన్ రెడ్డికి ఉన్న బలాన్ని చాటిచెబుతుంది” అని మాట్లాడారు. అసలు వీడియోను తెదేపాకు అనుకూలమైన భావం వచ్చేలాగ వివిద చోట్ల ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేమ్ లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, ఈ వీడియో 8 మార్చి 2024న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సందర్భంలోది అని తెలుసుకున్నాం (ఇక్కడ మరియు ఇక్కడ).
ఈ పూర్తి వీడియోను పరిశీలించగా, రామకృష్ణా రెడ్డి ఈ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు మరియు తెదేపాను విమర్శిస్తూ, “ 20 ఏళ్ల క్రిత చంద్రబాబు చేసిన మహా దోపిడీని చూసి తెలంగాణ హైకోర్టు సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. గతంలో చేసిన దోపిడీలను 2024లో ప్రజలు మర్చిపోయి ఉంటారు అని అనుకుంటూ, ఏదో ఒక రకంగా ఎన్నికల్లో గెలిచేందుకు ఛాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. జగన్ మోహన్ రెడ్డిని ఓడించేందుకు భాగంగా, బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో పడిగాపులు కాస్తూ ఆఖరి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చంద్రబాబు బాలహీనతను, ప్రజల్లో జగన్ మోహన్ రెడ్డికి ఉన్న బలాన్ని చాటిచెబుతుంది” అని మాట్లాడారు అని స్పష్టం అయింది.
అసలు వీడియోను తెదేపాకు అనుకూలమైన భావం వచ్చేలాగా వివిద చోట్ల ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ గురించి పలు వార్తా పత్రికలు ప్రచురించాయి (ఇక్కడ మరియు ఇక్కడ).
చివరిగా, సజ్జల రామకృష్ణారెడ్డి “జగన్ ఏం చేసినా ఎన్నికల్లో గెలవడు” అని అనలేదు.